ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల వాయిదా! ఇక సోమవారమే…

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పది తరగతి పరీక్షా ఫలితాల విడుదల వాయిదా పడింది. శనివారం (జూన్ 4, 2022) ఉదయం 11.30 గంటలకు విజయవాడలో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ఫ‌లితాలను విడుదల చేస్తారని అంతకుముందు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.

అంతేకాదు, ఈసారి గ్రేడ్‌లకు బదులు మార్కుల రూపంలో ఫలితాలు ప్రకటించనున్నట్లు తెలిపారు. దీంతో శనివారం ఉదయం నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠతో ఫలితాల విడుదల కోసం ఎదురు చూశారు. అయితే విద్యాశాఖ అనూహ్యంగా టెన్త్ ఫలితాల విడుదల వాయిదా వేసింది.

ఈ ఏడాది ఏప్రిల్‌ 27న ప్రారంభమైన టెన్త్‌ పరీక్షలు మే 9న పూర్తయిన సంగతి తెలిసిందే. విద్యాశాఖ సమాచారం ప్రకారం.. ఈ ఏడాది దాదాపు 6.5 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు.

తొలుత టెన్త్ ఫలితాలు జూన్ 10 నాటికి ప్రకటించవచ్చన్న విద్యాశాఖ అధికారులు.. ఆ తరువాత పరీక్షలు ముగిసిన 25 రోజుల్లోనే ఫలితాల విడుదలకు అవసరమైన అన్ని సన్నాహాలు చేశారు.

ఫలితాల విడుదల అనంతరం విద్యాసంస్థలు ర్యాంకులకు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వడంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందే ఆంక్షలు విధించింది.

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే.. మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తామని కూడా హెచ్చరించింది.

అయితే అనూహ్యంగా పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల వాయిదా పడింది. సాంకేతిక కారణాలు ఇందుకు దారితీసినట్లు అందుబాటులో ఉన్న అధికారులు చెబుతున్నప్పటికీ దీనికి సంబంధించిన పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు.

‘‘శనివారం ఉదయం 11 గంటలకు విడుదల చేయాల్సిన పదో తరగతి పరీక్షా ఫలితాలు కొన్ని అనివార్య కారణాల వల్ల సోమవారానికి వాయిదా వేయడం జరిగింది.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గమనించగలరు..’’ అని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద్ రెడ్డి తెలిపారు.

ఇందుకు దారితీసిన స్పష్టమైన కారణాలను ఆయన వివరించకపోయినప్పటికీ విద్యాశాఖలో సమన్వయ లోపం వల్లనే ఫలితాల విడుదల వాయిదా పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

 

- Advertisement -