ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి, తొలి మూడు స్థానాల్లో ఏ జిల్లాలంటే…

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఈ ఫలితాలను విడుదల చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈసారి ఫలితాలను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో మాత్రమే విడుదల చేసింది. అంతేకాదు.. ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకే దఫాలో విడుదల చేశారు.

ఫలితాల అనంతరం మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలో ఇదొక చరిత్రాత్మక రోజని, దేశంలో ఇతర రాష్ట్రాలకంటే ముందుగా ఏపీలో ఫలితాలు విడుదలచేశామని అన్నారు.

సీఎం జగన్ మార్గదర్శకాల మేరకు ఇబ్బందులు, ఆటంకాలను ఎదుర్కొని.. సమష్టిగా కృషి చేసి ఫలితాలను అందరికంటే ముందుగా విడుదల చేసినట్లు వ్యాఖ్యానించారు.

ఫలితాల్లో బాలికలదే పైచేయి…

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,07,230 లక్షల మంది విద్యార్థులు హాజరవగా 3,00,560 మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు.

ఉత్తీర్ణులైన వారిలో బాలికలు 64 శాతం కాగా.. బాలురు 55 శాతంగా ఉన్నట్లు చెప్పారు. 

అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 4,35,655 మంది హాజరుకాగా.. వీరిలో 2,76,389 మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు.

వీరిలోనూ బాలికలు 65 శాతం కాగా.. బాలురు 60 శాతంగా ఉన్నట్లు తెలిపారు. 

ఇక ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో తొలి స్థానం కృష్ణా జిల్లా(75 శాతం)కు దక్కగా, రెండోస్థానం పశ్చిమ గోదావరి, గుంటూరు(65 శాతం) జిల్లాలు, మూడో స్థానంలో విశాఖపట్నం(63 శాతం) జిల్లా నిలిచింది.

అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో తొలి స్థానం కృష్ణా జిల్లా(75 శాతం)కు దక్కగా, రెండోస్థానం పశ్చిమ గోదావరి(71 శాతం) జిల్లాలు, మూడో స్థానంలో నెల్లూరు, విశాఖపట్నం(68 శాతం) జిల్లాలు నిలిచాయి.

ఫలితాలను తెలుసుకోవాలనుకునే విద్యార్థులు వారి హాల్ టికెట్ నంబరు, పుట్టిన తేదీని నమోదు చేసి తెలుసుకోవచ్చు. 

ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలు.. సర్వర్-1, సర్వర్-2
ఇంటర్ ద్వితీయ సంత్సరం ఫలితాలు.. సర్వర్-1, సర్వర్-2
(ఫలితాలు ‘ఈనాడు’ సౌజన్యంతో)
- Advertisement -