33.2 C
Hyderabad
Saturday, September 19, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఏపీలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్.. నేటినుంచే దరఖాస్తుల స్వీకరణ

ఏపీలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్.. నేటినుంచే దరఖాస్తుల స్వీకరణ

- Advertisement -

స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కేంద్రాల్లో.. 16 వరకు దరఖాస్తుల స్వీకరణ
17 నుంచి దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన
24లోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి
26లోగా ‘సెర్ప్’ ఆమోదం

అమరావతి, 7 సెప్టెంబరు 2026: రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త! ఈ పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 61,92,396 మంది పింఛన్‌దారులు ఉండగా, ఈ పింఛన్ల కోసం నెలకు రూ.2,693 కోట్లు ఖర్చవుతోంది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన రాష్ట్ర జనాభాలో ఇప్పటివరకు 12.88 శాతం మంది పింఛన్లు పొందుతున్నారు.

తాజాగా రాష్ట్రంలో అర్హులైన వారికి కూడా ఎన్టీఆర్ భరోసా పింఛను ఇవ్వాలని భావించిన ప్రభుత్వం ఈ మేరకు తాజాగా విధివిధానాలను విడుదల చేసింది.  నిర్ణీత అర్హత ప్రమాణాల ప్రకారం వివిధ విభాగాలు దశలవారీగా కొత్త పింఛన్లను మంజూరు చేస్తాయి.

ఎంపీడీవో / మున్సిపల్‌ కమిషనర్‌.. దరఖాస్తుదారు వివరాలు, ధ్రువీకరణ పత్రాలు, సాధారణ అర్హత, ప్రస్తుత పింఛన్‌దారు డేటాబేస్‌ పరిశీలన, క్షేత్రస్థాయి పరిశీలన నివేదిక, ఈ కేవైసీ వివరాల ఆధారంగా దరఖాస్తుదారుల అర్హతను నిర్ణయిస్తారు.

ఈ మొత్తం ప్రక్రియను గడువులోగా పూర్తయ్యేలా జిల్లా కలెక్టర్లు చూస్తారు. తరువాత ప్రక్రియ కోసం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల దరఖాస్తులను సెర్ప్‌ సీఈవోకి పంపుతారు.

ప్రతి దశలోనూ పారదర్శకంగా…

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పరిశీలించేందుకు వెల్ఫేర్‌, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ లేదా వార్డు వెల్ఫేర్‌ డెవల్‌పమెంట్‌ సెక్రటరీకి పంపుతారు.

వారు దరఖాస్తుదారుల నివాసాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో అన్ని వివరాలు పరిశీలిస్తారు. ఈ సందర్భంగా తాము గమనించిన వివరాలను ఫారాల్లో నమోదు చేస్తారు. అవసరమైన దరఖాస్తుదారులకు ‘ఈకేవైసీ’ కూడా చేస్తారు.

క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత అధికారులు ఆయా లబ్ధిదారుల దరఖాస్తులు, సర్టిఫికెట్లను తమ లాగిన్‌లలో అప్‌లోడ్‌ చేసి ప్రభుత్వానికి పంపుతారు.

వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల దరఖాస్తులను ఎంపీడీవో / మున్సిపల్‌ కమిషనర్‌కు పంపిస్తారు. అలాగే ఒంటరి మహిళల దరఖాస్తులను తొలుత సంబంధిత తహసీల్దారుకు పంపి, వారి పరిశీలన అనంతరం వాటిని ఎంపీడీవో/మున్సిపల్‌ కమిషనర్లకు బదిలీ చేస్తారు.

ఇక గీత, చేనేత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, చర్మకారులు, ట్రాన్స్‌జెండర్‌ వర్గాల దరఖాస్తులను వారి వారి లాగిన్‌ల ద్వారా సంబంధిత జిల్లా స్థాయి అధికారులకు పంపుతారు.

వీటిని జిల్లా స్థాయి అధికారి లేదా ప్రత్యేకంగా నియమితుడైన అధికారులు ధ్రువీకరించి.. తమ తమ లాగిన్లలో ఆ వివరాలను అప్‌డేట్‌ చేస్తారు. ఆ తరువాత వాటిని ఎంపీడీవో / మున్సిపల్‌ కమిషనర్ల పరిశీలనకు పంపిస్తారు.

‘సెర్ప్‌’కే మంజూరు అధికారం…

ఎంపీడీవోలకు పింఛన్ మంజూరు చేసే అధికారం ఉండు. వారు కేవలం పింఛను దరఖాస్తుదారుల అర్హత / అనర్హతను మాత్రమే నిర్ణయిస్తారు. రాష్ట్రస్థాయిలో ఎస్‌జీఎస్‌డబ్ల్యూ, ఆర్టీజీఎస్‌, సెర్ప్‌ సంస్థలు పూర్తిగా పరిశీలించి దరఖాస్తులను ఆమోదిస్తాయి.

పింఛన్‌ పొందడానికి ఎవరైతే అనర్హులో.. వారి దరఖాస్తుల వివరాలను కారణాలతో సహా ప్రకటిస్తారు. వీటిని గ్రామ / మున్సిపల్ వార్డు సచివాలయాల్లో కూడా ప్రదర్శిస్తారు. అంతేకాదు, ఆ దరఖాస్తులను తిరిగి దరఖాస్తుదారులకు కూడా అందజేస్తారు.

ఇక ఎన్టీఆర్ భరోసా పింఛన్ పొందడానికి అర్హత సాధించిన దరఖాస్తుదారుల వివరాలను ప్రదర్శించడమేకాక వ్యక్తిగతంగా కూడా తెలియజేస్తారు.  సెర్ప్‌ తుది ఉత్తర్వులు జారీ చేసిన నెల నుంచి అర్హులైన వారికి ఈ ఎన్టీఆర్ భరోసా పింఛన్‌ను పంపిణీ చేస్తారు.

పింఛన్‌కు కావలసిన పత్రాలు ఇవే…

1. ఆధార్‌, రేషన్‌ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం
2. వృద్ధాప్య పింఛన్లకు వయో నిర్ధారణ సర్టిఫికెట్‌ లేదా ఆధార్‌
3. వితంతు పింఛన్లకు భర్త డెత్‌ సర్టిఫికెట్‌ మరియు భర్త ఆధార్‌
4. వివాహిత ఒంటరి మహిళలకు విడాకుల సర్టిఫికెట్‌
5. అవివాహిత ఒంటరి మహిళలకు తహసీల్దార్‌ సర్టిఫికెట్‌
6. దివ్యాంగుల(40 శాతం వైకల్యం)కు సదరం సర్టిఫికెట్‌
7. చేనేత కార్మికులకు జౌళిశాఖ ఇచ్చే సర్టిఫికెట్‌
8. మత్స్యకారులకు మత్స్యశాఖ ఇచ్చే సర్టిఫికెట్‌
9. డప్పుకళాకారులు, చర్మకారులకు సాంఘిక సంక్షేమ శాఖ ధ్రువపత్రం
10. కల్లుగీత కార్మికులకు ఎక్సైజ్‌ శాఖ సర్టిఫికెట్‌
11. ట్రాన్స్‌జెండర్లకు జిల్లా వైద్య బోర్డు ఇచ్చే ధ్రువపత్రం

- Advertisement -