హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ తండ్రి, రౌడీ షీటర్ చిన్న శ్రీశైలం యాదవ్‌ను పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. దీంతో యూసుఫ్‌గూడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎల్లారెడ్డిగూడలో జరిగిన ఓ హత్య కేసులో చిన్న శ్రీశైలం యాదవ్‌ను బైండోవర్ చేసేందుకు వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి ప్రయత్నించారు.
ఈ విషయం తెలియగానే చిన్న శ్రీశైలం యాదవ్ అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు సమీపంలోని శ్రీశైలం ఇంటికి చేరుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పలువురు చిన్న శ్రీశైలం యాదవ్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. అయినప్పటికీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శ్రీశైలం యాదవ్‌ను బలవంతంగా సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు.
‘‘నా ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకునేందుకు పోలీసుల కుట్ర…’’
మరోవైపు తన తండ్రిని అదుపులోకి తీసుకోవడంపై జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా తన ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకునేందుకే పోలీసులు చేసిన కుట్రగా ఆయన అభివర్ణించారు. గతంలో ఎంఐఎం పార్టీలో కొనసాగిన నవీన్ యాదవ్.. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తనకు టిక్కట్ కేటాయించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.
అయితే జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సహకరించాల్సిందిగా తనపై ఎంఐఎం నాయకుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోందని, దీనికి కారణం.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఎంఐఎం నాయకులకు ఉన్న సంత్సంబంధాలే కారణమని నవీన్ యాదవ్ అరోపించారు.
తాను వారి ఆదేశాలను ఖాతరు చేయకపోవడంతో పోలీసుల ద్వారా తన తండ్రిని అరెస్ట్ చేయించారని, ఎలాగైనా తన ప్రచారాన్ని అడ్డుకోవాలనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని నవీన్ యాదవ్ పేర్కొన్నారు. ఇలాంటి చర్యల ద్వారా తమ కుటుంబంతో పాటు తన అనుచరులు తీవ్ర భయాందోళనకు గురిచేయాలనేది తన ప్రత్యర్థుల ప్లాన్ అని వివరించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో…
2014 ఎన్నికల్లో జుబ్లీహిల్స్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. అయితే ఆ తరువాత జరిగిన పరిణామాల్లో.. టీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గెలుచుకున్న జూబ్లిహిల్స్ స్థానం ఈ సారి కూటమి ఖాతాలోకి వస్తుందా లేదా అని సర్వత్రా ఉత్కంఠ కలిగిస్తుంది. సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనూహ్యంగా సైకిల్ దిగి కారు ఎక్కారు.
అప్పటి ఎన్నికల్లో టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్ 50,898 ఓట్లు సంపాదించగా, ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ 41,656 ఓట్లు సాధించారు. మైనార్టీలు తమతో ఉంటారనే చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి కేవలం 33,642 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన మురళిగౌడ్ కేవలం 18,436 ఓట్లకే పరిమితమయ్యారు.
ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగెస్.. ఏవీ కూడా టీడీపీకి ఎదురు నిలవలేకపోయాయి. ఆ ఎన్నికల్లో దాదాపు 25.4 శాతం ఓట్లు సాధించి ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ రెండో స్థానంలో నిలిచారు. అయితే మాగంటి గోపీనాథ్ టీఆర్ఎస్‌లో చేరినప్పటికీ ఆయనతోపాటు టీడీపీ కేడర్ మొత్తం టీఆర్ఎస్‌లోకి వచ్చిందో లేదో అన్నది చిన్న అనుమానం.
నవీన్ యాదవ్‌ను లొంగదీసుకునేందుకే…
ఈసారి ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ టిక్కెట్ ఇవ్వకపోయినా.. టీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థి మాగంటికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి, ప్రచారం సాగిస్తోన్న నవీన్ యాదవ్‌ను నయానో, భయానో ఎలాగైనా కలుపుకుని మాగంటిని గెలిపించుకోవాలనే అధికార పార్టీ నాయకులు కుట్రకు పాల్పడుతున్నారని, అందులో భాగమే నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌ను పాత కేసులో అదుపులోకి తీసుకోవడమనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.