
హైదరాబాద్, 6 సెప్టెంబరు 2026: బీసీలకు న్యాయం జరగాలంటే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సమగ్రంగా, శాస్త్రీయంగా, పారదర్శకంగా కులగణన చేపట్టాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
ఆదివారం సాయంత్రం హైదరాబాద్ కోఠిలోని కందస్వామి లేన్‌లో నిర్వహించిన బీసీసీఈ 12వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన ఆయన బీసీల జనాభా, సామాజిక, ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన పూర్తి సమచారాన్ని తప్పనిసరిగా కులగణనలో సేకరించాలని అభిప్రాయపడ్డారు.
మంత్రి మాట్లాడుతూ.. 12 సంవత్సరాలుగా బీసీల హక్కులు, సామాజిక న్యాయం కోసం బీసీసీఈ చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. దేవేందర్ గౌడ్ గారు 26 పుస్తకాలను తెలుగులో ప్రచురించడంతో పాటు, ఇప్పటివరకు 1,265 సమావేశాల ద్వారా సామాజిక చైతన్యం తీసుకురావడం ప్రశంసనీయం అని పేర్కొన్నారు.
జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే, పెరియార్ రామస్వామి వంటి మహనీయుల జీవితాలు, ఆశయాలు, త్యాగాలను భవిష్యత్ తరాలకు చేరవేసేందుకు పుస్తకాలను ఇతర భాషల్లోకి అనువదించడం గొప్ప ప్రయత్నమని ఆయన వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వం కులగణన చేపడతామని ప్రకటించిన నేపథ్యంలో, దానికి సంబంధించి రూపొందించిన ప్రశ్నావళిలో బీసీలకు సంబంధించిన అంశాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని పొన్నం సూచించారు.
తెలంగాణలో ఇప్పటికే సమగ్ర కులగణన…
తెలంగాణలో తమ ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర కులగణనను ప్రామాణికంగా నిర్వహించిందని, దేశవ్యాప్తంగా కూడా శాస్త్రీయంగా, పారదర్శకంగా కులగణన జరిగితేనే బీసీల వాస్తవ జనాభా, వారి సామాజిక-ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన సమాచారం అందుబాటులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు.
50 శాతం రిజర్వేషన్ల పరిమితిపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ, 50 శాతం రిజర్వేషన్ల పరిమితిపై న్యాయస్థానాల తీర్పులు ఉన్నాయని చెప్పారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు 50 శాతం పరిమితి అడ్డంకిగా లేకపోతే, బీసీల రిజర్వేషన్ల విషయంలోనే ఈ పరిమితి ఎందుకు అడ్డంకిగా మారాలి? అని ఆయన ప్రశ్నించారు.
బీసీలకు సామాజిక న్యాయం కల్పించాలంటే వారి జనాభా లెక్కల ఆధారంగా విధానాలు రూపొందించాలని, బీసీల హక్కులు, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతోందన్నారు.
తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా సామాజిక న్యాయం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నారని, బీసీలకు న్యాయం జరిగే వరకు వారి హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పేర్కొన్నారు.
‘‘శాశ్వత భవనం కోసం స్థలం మంజూరు చేయండి..’’
బీసీసీఈ ఛైర్మన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హోమ్ శాఖ మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యులు తూళ్ల దేవేందర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మహనీయుల గాధల హిందీ, ఇంగ్లీషు అనువాద పుస్తకాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దేవేందర్ గౌడ్ బీసీసీఈ సంస్థకు శాశ్వత భవనం కోసం ప్రభుత్వం తరపున స్థలం కేటాయించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను కోరగా.. మంత్రి స్పందిస్తూ ఈ విషయంలో ప్రభుత్వం తరఫున సాధ్యమైనంత మేరకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో తొలుత బీసీసీఈ కార్యదర్శి, సీనియర్ జర్నలిస్ట్ ఇంద్రవెల్లి రమేష్ గడిచిన 12 ఏళ్లుగా బీసీసీఈ తరుపున చేపట్టిన కార్యక్రమాలను తన కార్యదర్శి నివేదికలో వివరించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ మాజీ ఛైర్మన్, రిటైర్డ్ జస్టిస్ వి.ఈశ్వరయ్య, తెలంగాణ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రియాజ్, ఢిల్లీ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఇనుకొండ తిరుమలి, అలాగే ప్రముఖ అంబేద్కరిస్టు జె.బి.రాజు, ప్రముఖ రచయిత బీఎస్ రాములు ప్రసంగించారు.
జేఎన్‌జేెమ్యాక్స్ సభ్యుల వినతి…
ఈ కార్యక్రమం చివరలో జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ (జేఎన్‌జేమ్యాక్స్) సభ్యులు జ్యోత్స్న, రమేష్‌బాబు, షరీఫ్, విశ్వేశ్వర్రావు, ఇంద్రవెల్లి రమేష్ తదితరులు తమ ఇళ్ల స్థలాల సమస్యపై మంత్రి పొన్నం ప్రభాకర్‌కు, దేవేందర్ గౌడ్‌కు వినతి పత్రాలు సమర్పించారు. ఏళ్ల తరబడి పెండింగులో ఉన్న తమ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.









