
హైదరాబాద్: భాగ్యనగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ)కు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర అవస్థలు మొదలయ్యాయి. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) పిలుపు మేరకు శుక్రవారం నుంచి సుమారు 25,000 మంది క్యాబ్ డ్రైవర్లు సమ్మె బాట పట్టడంతో విమానాశ్రయం వద్ద సర్వీసులు పూర్తిగా స్తంభించిపోయాయి. ఓలా, ఉబెర్, రాపిడో వంటి యాప్‌ల ద్వారా ఎయిర్‌పోర్ట్ ట్రిప్పులను డ్రైవర్లు పూర్తిగా నిలిపివేశారు.
ప్రధాన డిమాండ్ జీవో 46 అమలే
రాష్ట్ర ప్రభుత్వం 2022 డిసెంబర్ 9న ప్రవేశపెట్టిన జీవో 46ను వెంటనే అమల్లోకి తేయాలని యూనియన్ కోరుతోంది. ఈ నిబంధనల ప్రకారం ఎయిర్‌పోర్ట్ ప్రీపెయిడ్ క్యాబ్ సేవలకు కిలోమీటరుకు కనీసం రూ.21 చొప్పున ఛార్జీ చెల్లించాలి. అయితే ప్రస్తుతం క్యాబ్ సంస్థలు తమకు కిలోమీటరుకు కేవలం రూ.12 నుంచి రూ.15 మాత్రమే ఇస్తూ శ్రమదోపిడీకి పాల్పడుతున్నాయని యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ మండిపడ్డారు.
ఇటీవల ఆగస్టు 31న కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ సమక్షంలో కంపెనీల యాజమాన్యాలు, యూనియన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి ఫలితం దక్కలేదు. జీవో ప్రకారం సరైన దరలు చెల్లించాలని అధికారులు స్పష్టం చేసినా కంపెనీలు బేఖాతరు చేశాయని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేసి లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని యూనియన్ తేల్చిచెప్పింది.








