
అమరావతి, 12 సెప్టెంబరు 2026: నేర పరిశోధన రంగాల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించడంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మరో కీలక అడుగు వేసింది.
రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీలు (RFSL) నేరాల చేధనలో పోలీసు వ్యవస్థకు వెన్నుముక లాంటివని రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉద్ఘాటించారు.
రాజమండ్రి పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతిలోని తుళ్లూరు కేంద్రంగా రూ.253 కోట్ల భారీ వ్యయంతో, 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దేశంలోనే అత్యంత అతిపెద్ద స్టేట్ లెవల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ను నిర్మిస్తున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా రాజమండ్రి, తిరుపతి, అనంతపురం, విశాఖపట్నంతో పాటు పలు కీలక ప్రాంతాల్లో ఉన్న ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్ ల్యాబ్‌లను విపరీతంగా ఆధునికీకరిస్తున్నామని డీజీపీ తెలిపారు.
నేర నిరూపణలో కీలకమైన డీఎన్‌ఏ (DNA) నివేదికలను సాధారణంగా 7 రోజుల్లోనే అందిస్తున్నామని, అత్యంత సున్నితమైన, ప్రాధాన్యం కలిగిన కేసుల్లో ఏకంగా 13 గంటల వ్యవధిలోనే రిపోర్టులు ఇచ్చే స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరిచామని చెప్పారు.
సైబర్ నేరాలపై ‘క్లిక్’ నిఘా…
పెరిగిపోతున్న సైబర్ ముప్పులను అరికట్టడానికి జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా ‘క్లిక్’ (CLICK) కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ స్పష్టం చేశారు.
అలాగే రాబోయే రాజమండ్రి గోదావరి పుష్కరాల నిర్వహణలో భద్రతకు పెద్దపీట వేస్తున్నామని, రద్దీ నియంత్రణ కోసం అత్యాధునిక డ్రోన్లు, రికార్డింగ్ సదుపాయం కలిగిన సీసీటీవీ నెట్‌వర్క్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు.








