33.2 C
Hyderabad
Saturday, September 19, 2026
- Advertisement -
Home లైఫ్ స్టయిల్ ఆధ్యాత్మికం వినాయక పూజలో ‘గరిక’ ఎందుకు వాడతారో తెలుసా?

వినాయక పూజలో ‘గరిక’ ఎందుకు వాడతారో తెలుసా?

- Advertisement -

హైద‌రాబాద్‌: వినాయక చవితి పండుగ అనగానే మనకు ముందుగా గుర్తుకువచ్చేది ఏకవింశతి (21 రకాల) పత్ర పూజ. మాచీ, బృహతి, దత్తూర, జమ్మి వంటి 21 రకాల ఔషధ మూలికా పత్రాలతో విఘ్నేశ్వరుడిని పూజించినప్పటికీ.. స్వామివారికి అత్యంత ప్రియమైనదిగా ‘గరిక’ (దూర్వా గడ్డి)ని భావిస్తారు. సాధారణంగా కనిపించే ఈ గరికను లంబోధరుడి పూజలో ఎందుకు అంత ప్రత్యేకంగా వాడతారో వెనుక ఒక ఆసక్తికరమైన పౌరాణిక కథతో పాటు లోతైన దైవిక, జ్యోతిష్య భావనలు దాగి ఉన్నాయి.

పురాణాల ప్రకారం.. అనలాసురుడు అనే రాక్షసుడు దేవుళ్లను, రుషులను తీవ్రంగా వేధిస్తుండడంతో, వారంతా రక్షణ కోసం వినాయకుడిని వేడుకున్నారు. దీంతో ఆ రాక్షసుడిని గణనాథుడు ఏకంగా మింగేశాడు. ఆ కారణంగా వినాయకుడి ఉదరంలో తీవ్రమైన దాహం, శరీరం అంతటా విపరీతమైన వేడి పుట్టాయి. దేవతలు ఎన్ని ఉపాయాలు చేసినా స్వామివారి శరీరం చల్లబడలేదు. అప్పుడు కొందరు మునులు 21 గరిక పోచలను స్వామికి సమర్పించగా, ఆయన శరీరంలో క్షణాల్లో ఉపశమనం లభించి వేడి తగ్గింది. నాటి నుంచి విఘ్నేశ్వరుడికి గరికతో పూజ చేయడం ఆనవాయితీగా మారింది.

ఆడంబరం లేని భక్తి.. ఆధ్యాత్మిక సంకేతం!
ఈ పౌరాణిక కథ వెనుక మరొక లోతైన అర్థం కూడా ఉంది. విఘ్నాధిపతికి పూజలు చేయడానికి పెద్ద ఎత్తున ఖరీదైన ఆడంబరాలు అవసరం లేదు. ఎక్కడైనా సులభంగా లభించే చిన్న గరిక పోచను భక్తితో సమర్పించినా ఆయన సంతృప్తి చెంది విఘ్నాలను తొలగిస్తారని ఇది తెలియజేస్తుంది. ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా, తొక్కినా సరే తిరిగి మొలిచే తత్వం గరికది. ఇది స్థిరత్వానికి, వికాసానికి ప్రతీక.

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గరికను బుద్ధికి, జ్ఞానానికి సూచికగా భావిస్తారు. పిల్లల చేత వినాయకుడికి గరిక సమర్పించి పూజలు చేయించడం వల్ల బుధ గ్రహంతో పాటు కేతు గ్రహ అనుగ్రహం లభించి, జ్ఞాపకశక్తి, చదువులో ప్రావీణ్యం, మోక్ష మార్గానికి దారితీసే జ్ఞానం సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు.

- Advertisement -