33.2 C
Hyderabad
Saturday, September 19, 2026
- Advertisement -
Home అవీ-ఇవీ ప్రేమలో విఫలమై.. ఖర్చుల కోసం కోర్టుకెక్కిన భారత సంతతి సీఈవో!

ప్రేమలో విఫలమై.. ఖర్చుల కోసం కోర్టుకెక్కిన భారత సంతతి సీఈవో!

lovers
- Advertisement -

ప్రేమ వ్యవహారాలు వికటించి దారులు వేరైనప్పుడు కొందరు మౌనంగా నిష్క్రమిస్తే, మరికొందరు పగ, ప్రతీకారాలతో వార్తల్లోకెక్కుతారు. కానీ, సింగపూర్‌లోని ఓ భారత సంతతి వ్యాపారవేత్త మాత్రం ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి వార్తల్లో నిలిచారు. బ్రేకప్ అయిన తర్వాత తన మాజీ ప్రియురాలికి కొనిచ్చిన కానుకలు, చేసిన ఖర్చుల మొత్తం తిరిగి ఇచ్చేయాలంటూ కోర్టు మెట్లు ఎక్కడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

సింగపూర్‌లోని ఒక లాజిస్టిక్స్ సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తున్న భారత సంతతి వ్యక్తి చందర్ అగర్వాల్. 2019లో ఆయనకు ఫెలిసియా లీ అనే యువతితో పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. నాలుగేళ్ల పాటు సాగిన వీరి బంధం మనస్పర్థల కారణంగా 2023లో ముగిసింది. అయితే, ఆ సమయానికి తన ప్రేమికురాలి చదువుల కోసమని, విలాసవంతమైన బహుమతుల రూపంలో దాదాపు రూ.3.5 కోట్లు (4.68 లక్షల సింగపూర్ డాలర్లు) ఖర్చు చేశానని అగర్వాల్ వాపోయారు. త‌న‌ను కాదనుకుని వెళ్లిపోయాక, ఆ డబ్బులు ఎందుకు ఉంచుకుంటావంటూ ఆమెను ప్రశ్నించారు. అక్కడ నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో, ఆ సొమ్మంతా తాను ఇచ్చిన ‘అప్పు’ మాత్రమేనని, దానికి సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయని చెబుతూ సింగపూర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ వివాదంపై విచారణ జరిపిన న్యాయస్థానం అగర్వాల్‌ వాదనలను కొట్టిపడేసింది. ఒప్పంద పత్రాలపై తాను ఎలాంటి సంతకం చేయలేదని సదరు యువతి కోర్టుకు స్పష్టం చేసింది. అంతేకాకుండా, వారి మధ్య జరిగిన పాత చాటింగ్‌లను పరిశీలించిన ధర్మాసనం.. ఆ మొత్తాన్ని చందర్ అగర్వాల్ పూర్తిగా తన ఇష్టంతో, బహుమతులుగానే ఇచ్చారని నిర్ధారించింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌ను చెత్తబుట్టలో వేయడమే కాకుండా.. ఈ కేసు విచారణ కోసం ఆ యువతికి అయిన కోర్టు ఖర్చులను కూడా చందర్ అగర్వాల్‌ నుంచే వసూలు చేయాలని ఆదేశించింది. ప్రేమ కథ చివరకు భారీ జరిమానాతో ముగియడం గమనార్హం.

- Advertisement -