
వరంగల్: కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమిస్తున్నారంటూ గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. ఆ ప్రచారమంతా కేవలం కల్పితమని, ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఆదివారం వరంగల్‌లో తన భర్త కొండా మురళితో కలిసి నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఆమె ఈ ఊహాగానాలకు ముగింపు పలికారు.
“మేము కాంగ్రెస్‌లోనే పుట్టి పెరిగాము. వేరే పార్టీలోకి వెళ్లే ఆలోచన ఎంతమాత్రం లేదు” అని సురేఖ స్పష్టం చేశారు. గతంలో కొన్ని అనివార్య పరిస్థితుల వల్లే బీఆర్ఎస్‌లోకి వెళ్లాల్సి వచ్చిందని గుర్తుచేస్తూ, భవిష్యత్తులో జరిగే ప్రతి ఎన్నికలోనూ కాంగ్రెస్ బి ఫామ్‌పైనే పోటీ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
మంత్రివర్గం నుంచి తనను తొలగించడంపై మాట్లాడుతూ.. పదవి పోయినందుకు బాధ లేదని, అయితే కారణం చెప్పకపోవడమే కొంత ఆవేదన కలిగించిందన్నారు. మూడు శాఖలను ఎలాంటి అవినీతి మరక పడకుండా నడిపించానని పేర్కొన్నారు. అధిష్ఠానం కూడా తనకు ఫోన్ చేసి విచారించిందని, పార్టీ వీడనని స్పష్టం చేసినట్లు వెల్లడించారు.
వచ్చే ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి మళ్లీ గెలిచి మంత్రిగా తిరిగొస్తానని, అలాగే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 24 నుండి 25 డివిజన్లలో కాంగ్రెస్‌ను విజయం దిశగా నడిపించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఈ సందర్భంగా బస్వరాజు సారయ్య, చల్లా ధర్మారెడ్డి వంటి స్థానిక నేతలపై ఆమె ఘాటు విమర్శలు గుప్పించారు.
క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు: కొండా మురళి
ఇదే సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత కొండా మురళి మాట్లాడుతూ.. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి పదవులను కాపాడుకోబోమని స్పష్టం చేశారు. “ఒక్కసారి సారీ చెబితే పదవి ఉంటుందని కొందరు నేతలు చెప్పారు. కానీ పదవి పోయినా సరే క్షమాపణ మాత్రం చెప్పేది లేదని సురేఖ కరాఖండిగా చెప్పింది” అని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ ప్రధాన లక్ష్యమని, తమ విధేయత ఎప్పుడూ కాంగ్రెస్ వైపేనని ఆయన పునరుద్ఘాటించారు. భావోద్వేగానికి గురైన ఆయన, తన శరీరంలో నాలుగు బుల్లెట్లు ఉన్నా ఇంకా బతికే ఉన్నానని, తామంతా కాంగ్రెస్ గెలుపు కోసమే పోరాడతామని స్పష్టం చేశారు.








