
హైదరాబాద్, 2 సెప్టెంబర్ 2026: నగరంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న వ్యక్తి రూ.10 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికిపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఏసీబీ అధికారుల కథనం ప్రకారం… టోలీచౌకీ పోలీస్ స్టేషన్‌లో ఆర్.పాండునాయక్ (R.Pandu Naik) ఎస్సైగా పనిచేస్తున్నాడు. గోల్కొండ జమాలికుంట ప్రాంతానికి చెందిన ఓ కుటుంబంలో గత నెల 28న గొడవ జరగగా.. దీనిపై ఆ కుటుంబానికి చెందిన సభ్యుడు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ కేసులో ఫిర్యాదుదారుడి తల్లిపై కేను నమోదు చేయకుండా ఉండేందుకు, పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు రూ.10 వేలు లంచం ఇవ్వాలని ఎస్సై పాండునాయక్ డిమాండ్ చేశాడు.
ఆ మేరకు మంగళవారం సాయంత్రం ఫిర్యాదుదారుడి నుంచి రూ.10 వేలు పుచ్చుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ మాజిద్ తన బృందంతో దాడి చేసి ఎస్సై పాండునాయక్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.








