
హైదరాబాద్: చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్, ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రష్టి వర్మ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీర్థం పుచ్చుకున్నారు.
హైదరాబాద్‌లోని ఆ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. శ్రష్టి వర్మతో పాటు మరికొందరు ప్రముఖులు కూడా పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా రామచందర్‌రావు మాట్లాడుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు ఏకమవుతున్న ప్రస్తుత తరుణంలో యువత రాజకీయ చైతన్యం చూపడం, అందులోనూ దేశాభివృద్ధికి కట్టుబడిన బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై రావడం హర్షణీయమని పేర్కొన్నారు.
ఎవరీ శ్రష్టి వర్మ?
ఉత్తర్‌ప్రదేశ్ ఇటావాకు చెందిన శ్రష్టి వర్మ, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి స్వశక్తితో చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. 8 ఏళ్ల వయసులోనే భరతనాట్యంలో ప్రతిభ చాటి ‘తాజ్ మహోత్సవ్’ వంటి జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు.
ఈటీవీ ప్రజాదరణ పొందిన ‘ఢీ’ షో ద్వారా గుర్తింపు పొంది, అనతికాలంలోనే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అగ్ర కథానాయకుల సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు. ఐ
కాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 లోని ‘సూసేకి..’, సూపర్‌స్టార్ రజనీకాంత్ జైలర్ లోని ‘నువ్వు కావాలయ్యా’ వంటి సంచలన పాటలతో పాటు క్రాక్, బీస్ట్, అల వైకుంఠపురములో, గేమ్ ఛేంజర్, కిసి కా భాయ్ కిసి కా జాన్ వంటి భారీ చిత్రాలకు పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇటీవల ముగిసిన ‘బిగ్ బాస్’ సీజన్ 9లోనూ కంటెస్టెంట్‌గా అలరించిన ఆమె, ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టి తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు.








