
అమరావతి, 12 సెప్టెంబరు 2026: వెనుకబడిన వర్గాల (బీసీ) ఆత్మగౌరవాన్ని పరిరక్షించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు.
విజయవాడ సమీపంలోని గొల్లపూడి బీసీ భవన్‌లో నిర్వహించిన ‘బీసీ రక్షణ చట్టం’ అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే బీసీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో సముచిత గుర్తింపు దక్కుతోందన్నారు.
పాదయాత్ర, ఎన్నికల ప్రచారంలో భాగంగా యువనేత నారా లోకేశ్ ఇచ్చిన హామీకి కట్టుబడి, దేశంలోనే ప్రథమంగా ఆంధ్రప్రదేశ్‌లో ‘బీసీ రక్షణ చట్టం’ అమలుచేయబోతున్నామని మంత్రి సవిత ప్రకటించారు. బీసీల కులాన్ని, వృత్తులను హేళన చేసినా లేదా సంఘ బహిష్కరణలకు పాల్పడినా కఠిన శిక్షలు పడేలా చర్యలు ఉంటాయన్నారు.
బాధిత వర్గాలకు త్వరితగతిన న్యాయం అందించేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి, కేసులను 2 నెలల వ్యవధిలోనే విచారించి తీర్పునిచ్చేలా సమగ్ర నిబంధనలు రూపొందించామని తెలిపారు. ఈ చట్టంలో 156 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రజాప్రతినిధుల సలహాలను పొందుపరిచామని చెప్పారు.
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పునరుద్ధరణ…
గత వైసీపీ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించి తీరని ద్రోహం చేసిందని మంత్రి ధ్వజమెత్తారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వం తిరిగి 34 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తుందని స్పష్టం చేశారు.
దీనితో పాటు చేతివృత్తుల వారిని ఆర్థికంగా నిలబెట్టేందుకు గతంలో ప్రాచుర్యం పొందిన ‘ఆదరణ’ పథకాన్ని ‘ఆదరణ 3.0’ పేరిట త్వరలోనే పునఃప్రారంభిస్తామని ఆమె హామీ ఇచ్చారు.








