33.2 C
Hyderabad
Saturday, September 19, 2026
- Advertisement -
Home క్రికెట్ భారత్‌ విజయం దిశగా గాలె టెస్ట్

భారత్‌ విజయం దిశగా గాలె టెస్ట్

- Advertisement -

గాలె (ఆగస్టు 17): శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తన పట్టును మరింత బిగించింది.

మూడో రోజు ఆటలో శ్రీలంక యువ బ్యాటర్ సోనాల్ దినుషా (100) మెరుపు సెంచరీతో పోరాడినప్పటికీ, భారత బౌలర్లు విజృంభించడంతో లంక తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకే ఆలౌట్ అయింది.

దీంతో టీమిండియాకు 178 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం వర్షం పడటంతో మూడో రోజు ఆటను అంపైర్లు త్వరగానే ముగించారు.

దినుషా, డిక్వెల్లా పోరాటం…

462 ప‌రుగుల వ‌ద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించిన భార‌త్‌.. బౌలింగ్‌లోనూ ప్ర‌తాపం చూపింది. మ‌హ్మ‌ద్ సిరాజ్ తాను వేసిన రెండో బంతికే లంక‌ ఓపెనర్ మదుష్కను డకౌట్ చేశాడు.  త‌ర్వాత స్పిన్న‌ర్లు కూడా విజృంభించ‌డంతో లంక ఒకానొక దశలో 90/5 తో పీకల్లోతు కష్టాల్లో పడి, ఫాలో-ఆన్ ప్రమాదంలో పడింది.

ఆ సమయంలో సోనాల్ దినుషా (168 బంతుల్లో 100; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా (115 బంతుల్లో 80) కలిసి ఆరో వికెట్‌కు 146 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నారు.  దినుషా తన టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేసుకోగా, డిక్వెల్లాను ప్రసిద్ధ్ కృష్ణ పెవిలియన్ చేర్చడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది.

రవీంద్ర జడేజా అరుదైన రికార్డు…

భారత బౌలర్లలో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ (4/76) అత్యుత్తమ బౌలింగ్‌ నమోదు చేయగా, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (3/57) కీలక వికెట్లు తీశారు. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్‌దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.

ఈ మ్యాచ్‌లోనే రవీంద్ర జడేజా కీలక మైలురాయిని దాటాడు. టెస్టుల్లో 350 వికెట్లు తీసిన 5వ భారత బౌలర్‌గా నిలవడమే కాకుండా, టెస్టుల్లో 4,000కుపైగా పరుగులు, 350కిపైగా వికెట్లు సాధించిన ప్రపంచంలోనే ఐదో ఆల్‌రౌండర్‌గా (భారత్ తరఫున కపిల్ దేవ్ తర్వాత రెండో బౌలర్‌గా) రికార్డు పుటలకెక్కాడు.

వర్షం ఆటంకం…

ఆట ముగిసే సమయానికి వర్షం భారీగా పడటంతో మూడో రోజు 13 ఓవర్ల ఆట నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిక్యంలో ఉన్నప్పటికీ, రానున్న రెండు రోజుల్లో వాతావరణం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

నాలుగో రోజు ఉదయం భారత్ త్వ‌ర‌గా పరుగులు చేసి డిక్లేర్ చేసే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -