న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో గురువారం(ఈ నెల 9వ తేదీ) నుంచి జరగనున్న టీ20 సిరీస్‌కు టీమిండియా సారథిగా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఎంపికయ్యాడు.
గాయం కారణంగా కేఎల్ రాహుల్ సిరీస్‌కు దూరం కావడంతో పంత్‌కు బీసీసీఐ సారథ్య బాధ్యతలు అప్పగించింది. హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్‌గా నియమించింది.
గత సాయంత్రం నెట్స్‌లో గాయపడిన కుల్దీప్ యాదవ్ కూడా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు.
వరుసగా 12 మ్యాచ్‌లు గెలిచి మంచి ఊపుమీదున్న మెన్ ఇన్ బ్లూ.. రేపు (గురువారం) జరగనున్న తొలి మ్యాచ్‌లో విజయం సాధిస్తే వరుసగా 13 మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా ఆల్‌టైం రికార్డును సొంతం చేసుకుంటుంది.
టీ20 ప్రపంచ కప్ లక్ష్యంగా…
అక్టోబరులో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్‌ను ఉపయోగించుకుని అత్యుత్తమ జట్టును సిద్ధం చేయడమే లక్ష్యంగా ద్రవిడ్ పనిచేస్తున్నాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఈ సిరీస్‌లో విశ్రాంతి కల్పించిన నేపథ్యంలో రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్‌లలో ఎవరో ఒకరికి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం లభించనుంది.
5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుండగా, రెండో మ్యాచ్‌కు కటక్‌లోని బారాబతి స్టేడియం అతిథ్యం ఇవ్వనుంది.
ఇక మూడో మ్యాచ్‌కు విశాఖపట్టణంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం, నాలుగో మ్యాచ్‌కు రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, చివరి మ్యాచ్‌కు బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
భారత జట్టు: రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), వెకంటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.