26.8 C
Hyderabad
Monday, November 2, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు.. వైసీపీకి సవాల్!

మెగా డీఎస్సీపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు.. వైసీపీకి సవాల్!

- Advertisement -

అమరావతి (ఆగస్టు 17): రాష్ట్రంలో చేపట్టిన ‘మెగా డీఎస్సీ’ నియామకాల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగానే పూర్తయిందని, ఇందులో ఒక్క డీవియేషన్ (అక్రమం) కూడా జరగలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

సోమవారం శాసనసభలో మెగా డీఎస్సీ నియామకాలపై జరిగిన సుదీర్ఘ చర్చలో పాల్గొన్న ఆయన, ఈ అంశంపై విపక్ష వైసీపీ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దమ్ము, ధైర్యం ఉంటే సభకు వచ్చి తమ వద్ద ఉన్న ఆధారాలతో చర్చించాలని విపక్షానికి సవాల్ విసిరారు.

148 రోజుల్లోనే 15,941 ఉపాధ్యాయ నియామకాలు…

గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయలేకపోయిందని ఎద్దేవా చేసిన సీఎం, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకంతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని గుర్తుచేశారు.

కేవలం 148 రోజుల్లోనే 15,941 ఉద్యోగాలను మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో భర్తీ చేశామన్నారు.

13 సబ్జెక్టులకు సంబంధించి 42 వేల ప్రశ్నలతో 154 కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) విధానంలో అత్యంత కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించామని, నియామక వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పారదర్శకంగా అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.

వైసీపీవి ఫేక్ ఆందోళనలు – పబ్జీ రాజకీయాలు…

వైసీపీ ఒడిశా కూలీలతో, వృద్ధులతో ఫేక్ ధర్నాలు చేయిస్తూ డీఎస్సీపై దుష్ప్రచారం చేస్తోందని సీఎం మండిపడ్డారు.

వారి అసత్య ప్రచారాలను నిరసిస్తూ, కష్టపడి ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులే స్వయంగా రోడ్లపైకి వచ్చి విజయవాడ, కర్నూలులలో ఆందోళనలు చేపడుతున్న విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు.

“అసెంబ్లీకి వచ్చి చర్చించే ధైర్యం లేక వైసీపీ సభ్యులు బయట పబ్జీలు ఆడుకుంటున్నారు. రెండున్నరేళ్లుగా సభకు రాకుండానే జీతాలు, సౌకర్యాలు పొందుతున్నారు” అని విమర్శించారు.

విద్యారంగానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తుందని, ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదని పునరుద్ఘాటించారు.

- Advertisement -