హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇక్కడి మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రం(ఎంసీహెచ్ఆర్‌డీ)లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు.
ఫలితాలు https://www.bse.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఈ వెబ్ సైట్‌లోకి వెళ్లి.. అక్కడ కనిపించే రిజల్ట్ లింక్‌పై క్లిక్ చేసి.. తమ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.
కోవిడ్ పరిస్థితుల కారణంగా గత రెండుళ్లుగా పదో తరగతి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పాస్ చేస్తూ వచ్చారు. రెండేళ్ల తర్వాత ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను నిర్వహించారు.
మే 23 నుంచి జూన్ 1 వరకు పరీక్షలను నిర్వహించగా, ఈసారి 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకు కుదించి పరీక్షలు నిర్వహించారు.
టెన్త్ ఫలితాల విడుదల అనంతరం మంత్రి సబిత మాట్లాడుతూ.. ఈ ఏడాది 90 శాతం ఉత్తీర్ణత నమోదయిందని, బాలురు కంటే బాలికలే పైచేయిగా నిలిచినట్లు వెల్లడించారు. బాలురులో 87.61 శాతం, బాలికల్లో 92.45 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.
3,007 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైందని, 15 పాఠశాలల్లో 0 శాతం ఉత్తీర్ణత నమోదైందని మంత్రి సబిత వివరించారు.
ఫలితాల్లో సిద్దిపేట ప్రథమ స్థానంలో నిలువగా.. నిర్మల్, సంగారెడ్డి జిల్లాలు రెండు మూడు స్థానాల్లో ఉన్నట్లు చెప్పారు. ఈసారి హైదరాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 11,401 పాఠశాలలకు చెందిన 5,03,579 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారని, వారిలో 4,53,201 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని మంత్రి సబిత తెలిపారు.
ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ…
ఫెయిలైన విద్యార్థుల కోసం ఆగస్టు 1 నుంచి 10 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని, అలాగే రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్‌కు అవకాశం కల్పిస్తామని, అవసరమైతే విద్యార్థులు రాసిన పరీక్ష పేపర్ల జిరాక్స్ కూడా ఇస్తామని మంత్రి ప్రకటించారు.
ఫెయిలైన విద్యార్థులకు వారానికి రెండుసార్లు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని, దీనికి సంబంధించిన ఆదేశాలు త్వరలోనే విడుదల అవుతాయని, ఉపాధ్యాయులు దీన్ని భారంగా కాకుండా బాధ్యతగా భావించాలంటూ సూచించారు.