ముంబై: మహారాష్ట్రలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం కీలక మలుపు తిరిగింది. అసెంబ్లీలో బల పరీక్ష ఎదుర్కొనడానికి ముందే ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే గవర్నర్ ఆయన రాజీనామాను ఆమోదించారు.
మొత్తానికి శివసేనలోని ఏక్‌నాథ్ షిండే వర్గీయుల తిరుగుబాటు చివరికి మహా వికాస్ అఘాడీ సర్కారు కూలిపోవడానికి దారితీసింది.
గురువారం అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలంటూ ఆ రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను.. సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కొద్దిసేపటికే సీఎం ఠాక్రే తన రాజీనామాను ప్రకటించారు.
తన నివాసం మాతోశ్రీ నుంచి స్వయంగా కారు నడుపుకుంటూ రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన అక్కడ గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీని కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలంటూ గవర్నర్ ఉద్ధవ్‌ను కోరారు.