దేశంలో క్రమంగా పెరుగుతున్న ‘కరోనా’ వ్యాప్తి! రెండో రోజూ 8 వేలకుపైగా పాజిటివ్ కేసులు…

- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో ‘కరోనా’ చాప కింద నీరులా విస్తరిస్తోంది. మెల్లమెల్లగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 44,513.

వరుసగా రెండో రోజైన శనివారం కూడా 8 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 8,582 మందికి కరోనా నిర్ధారణ అయింది.

4,435 మంది కరోనా రక్కసి బారి నుంచి కోలుకోగా, నలుగురు కోవిడ్‌ కాటుకు బలయ్యారు.  తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,32,22,017కి పెరిగింది.

ఇప్పటి వరకు కరోనా కారణంగా 5,24,761 మంది మృతి చెందారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 2.71 శాతానికి చేరుకుంది. రికవరీ రేటు 98.68 శాతానికి పడిపోయింది.

క్రియాశీల రేటు 0.10 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 194.9 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. ప్రస్తుతం ఒమిక్రాన్‌లోని బీఏ4, బీఏ5 వేరియంట్ల కారణంగా కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.

 

- Advertisement -