గంగారామ్ ఆసుపత్రిలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. ఏం జరిగింది?

- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీలోని గాంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ఇటీవల కరోనా బారిన పడ్డ ఆమె హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది.

‘నేషనల్ హెరాల్డ్’కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈ నెల 8న సోనియాగాంధీ హాజరుకావలసి ఉంది. ఈ మేరకు ఆమెకు, ఆమె కుమారుడు, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఆమెకు ఈ నెల 2నే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడంతో అప్పట్నించి ఇంటి వద్దనే చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈడీ ఎదుట హాజరు అయ్యేందుకు తనకు మరింత గడువు కావాలని కూడా ఆమె కోరారు.

ఆదివారం ఉన్నట్లుండి సోనియా గంగారామ్ ఆసుపత్రిలో చేరడంతో ఆమె ఆరోగ్యంపై కాంగ్రెస్ వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమయింది.

అయితే సోనియా ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నందున ఆమె ఆసుపత్రిలోనే ఉంటారని ఆ పార్టీ అధికార ప్రతినిది రణదీప్ సూర్జేవాలా తెలిపారు.

సోనియా త్వరగా కోలుకోవాలంటూ సందేశాలు పంపిస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు.

 

- Advertisement -