‘‘నో క్యాస్ట్ ఫీలింగ్.. ఇలా ఉంటే చాలు.. పెళ్లి చేసుకుంటా.. వచ్చేయండి’’: వైరల్‌గా మారిన హజారీభాగ్ యువతి పెళ్లి ప్రకటన

- Advertisement -

ఝార్ఖండ్: ఓ యువతి ఇచ్చిన పెళ్లి ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ‘కులం చూడను.. కాస్త వయసు తక్కువున్నా పర్వాలేదు.. నాకు కాబోయే వాడు ఇలా ఉంటేే చాలు..’ అంటూ వెలువడిన ఆ ప్రకటన వైరల్‌గా మారింది.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.  ఝార్ఖండ్ హజారీ‌భాగ్‌లోని విష్ణుపురికి చెందిన బంగాలీ దుర్గ వివాహం చేసుకోవాలని అనుకుంది. అంతేకాదు, తనకు తగ్గ వరుడిని తానే వెతుక్కోవాలని భావించింది.

ఈ మేరకు తనకు ఎలాంటి వరుడు కావాలో వివరిస్తూ పత్రికా ప్రకటన ఇచ్చింది. అంతటితో ఊరుకోకుండా ఓ పెళ్లి వేడుకలో గోడపై ఆ ప్రకటనను అంటించింది.

వయసు 30-40 మధ్య ఉండాలి.. ఏ కులానికి చెందిన అబ్బాయి అయినా పర్వాలేదు.. నా కంటే వయసు తక్కువ వాడైనా అడ్జెస్టయిపోతా.. కాకపోతే అబద్ధాలు అస్సలు ఆడకూడదు, చురుగ్గా ఉండాలి, పిసినిగొట్టులా వ్యవహరించకూడదు..’’ అంటూ తనకు కాబోయే వరుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలో ఆ ప్రకటనలో వివరించింది.

అంతేకాదు, దూరం దగ్గర ఆలోచించకండి.. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్లు సంప్రదించండి.. అంటూ ఓ రెండు ఫోన్ నంబర్లు కూడా ఆ ప్రకటనలో దుర్గ పొందుపరిచింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ప్రకటన తెగ వైరల్ అవుతోంది.  మరింకేంటి? ఆమె పేర్కొన్న లక్షణాలు మీలో ఉన్నాయనుకుంటే.. ముందు ఫోన్ కొట్టండి.. ఆ తరువాత ఆ పిల్లను చేపట్టండి.. ఏమంటారు!?

- Advertisement -