‘‘నేను కోరుకున్న జీవితం ఇది కాదు.. అందుకే ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నా..’’: సూసైడ్ నోట్‌లో ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష

- Advertisement -

హైదరాబాద్: నగరానికి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల(36) శనివారం బంజారాహిల్స్‌లోని తన బొటిక్ బాత్‌రూమ్‌లో విగతజీవిగా కనిపించారు.

ఫ్రెండ్స్ వద్దకు వెళుతున్నానంటూ శుక్రవారం సాయంత్రం తన తల్లితో చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన ఆమె తన బొటిక్‌కు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు.

ఘటనా స్థలం వద్ద పోలీసులకు సూసైడ్ నోట్ లభ్యమైంది. దాంతోపాటు ప్రత్యూషకు సంబంధించిన సెల్‌ఫోన్, పెన్‌డ్రైవ్‌ వారు స్వాధీనం చేసుకున్నారు.

‘రోజూ ఏడుస్తూ బతకలేను. ఇంకా ఎంతకాలం తల్లిదండ్రులపై ఆధారపడాలి? నేను ఆశించిన ప్రపంచం ఇది కాదు. నేను కోరుకున్న అందమైన ప్రపంచం నాకు కనిపించడం లేదు..’ అంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొని ఉంది.

ప్రత్యూష.. మహారాష్ట్ర కేడర్ విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి జీవీ కృష్ణారావు ముగ్గురు సంతానంలో చిన్న అమ్మాయి. కృష్ణారావు విజయవాడలో ఉంటుండగా, ప్రత్యూష తన తల్లితో కలిసి జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 86లో ఉంటోంది.

విదేశాల్లో చదువు పూర్తి చేసిన ప్రత్యూష 2013లో బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో ఉన్న ఎమ్మెల్యే కాలనీలో ‘ప్రత్యూష గరిమెళ్ల గార్మెంట్స్’ పేరుతో ఒక బొటిక్‌ను ప్రారంభించారు.

ప్రత్యూష దేశంలోని 30 మంది అగ్రశ్రేణి డిజైనర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌ తారలకు కూడా ఆమె డ్రెస్ డిజైనర్‌గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో పలు అవార్డులు కూడా అందుకున్నారు.

కొంత కాలంగా ప్రత్యూష ముబావంగా ఉంటోందని ఆమె స్నేహితులు కొందరు పోలీసులకు తెలిపారు. ప్రత్యూష ఆత్మహత్య విషయం తెలియగానే బీజేపీ నాయకుడు సుజనా చౌదరి బొటిక్‌ వద్దకు చేరుకుని ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఆత్మహత్యకు ముందు ప్రత్యూష ఒక సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నట్లు.. ఆ వీడియోలో తన మనోభావాలను వ్యక్తీకరించినట్లు కూడా తెలుస్తోంది.

అసలేం జరిగిందంటే…

శుక్రవారం సాయంత్రం 4.45 గంటల ప్రాంతంలో తన బొటిక్‌కు వెళుతూ.. ‘స్నేహితుల వద్దకు వెళుతున్నాను.. రాత్రికి తిరిగి రాను.. శనివారం వస్తా..’ అని తన తల్లితో చెప్పారు.

కాసేపటి తరువాత ఫోన్ చేసిన తన తండ్రితో కూడా ఆమె ఆ మాటే చెప్పినట్లు తెలుస్తోంది. ఆ రోజు రాత్రి తల్లిదండ్రులు ఫోన్ చేసినా ఆమె నుంచి స్పందన లభించలేదు.

అప్పుడప్పుడు స్నేహితుల ఇళ్లకు వెళ్లి గడిపే అలవాటు ఉండడంతో వారికి కూడా అనుమానం రాలేదు. అయితే శనివారం కూడా తిరిగి ఇంటికి రాకపోవడంతో ప్రత్యూష కుటుంబ సభ్యులు.. స్నేహితులను వాకబు చేశారు.

ఆచూకీ తెలియకపోవడంతో వారు తమ బంధువుల ఇళ్లకు కూడా ఫోన్ చేసి విచారించారు. అయినా ఫలితం లేకపోవడంతో చివరికి బొటిక్ వద్దకు వెళ్లారు.

కాలింగ్ బెల్ మోగించినా ప్రత్యూష తలుపు తెరవకపోవడం, శుక్రవారం సాయంత్రం నుంచి ప్రత్యూష బొటిక్‌లోనే ఉన్నదంటూ అక్కడి వాచ్‌మాన్ చెప్పడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది.

దీంతో తలుపు పగులగొట్టి వారు బొటిక్ లోపలికి ప్రవేశించారు. లోపల ఎక్కడా ప్రత్యూష కనిపించకపోవడం, బాత్‌రూమ్ తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉండడంతో దాన్ని కూడా బద్ధలు కొట్టారు.

అప్పుడు లోపల కుర్చీలో ప్రత్యూష మృతదేహం వారికి కనిపించింది. మృతదేహం నల్లగా కమిలిపోవడమేకాక, ఆమె చేతిలో ఒక లేఖ కూడా కనిపించింది.

కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అందగానే బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో కార్బన్ మోనాక్సైడ్ రసాయనాన్ని వారు గుర్తించారు.

బాత్‌రూమ్‌లోని ఎగ్జాస్ట్ ఫ్యాన్‌కు ఓ అట్టను అడ్డుగా ఉంచి.. ఆ రసాయనాన్ని నిప్పులపై మండించి తద్వారా వెలువడిన పొగను పీల్చి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

అయితే తమ కుమార్తె మృతిపై ప్రత్యూష కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేసినట్లు సమాచారం.

బొటిక్ వాచ్‌మాన్‌ను అదుపులోనికి తీసుకుని.. ప్రత్యూష మరణానికి దారితీసిన కారణాలపై వారు మరిన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -