గల్వాన్ ఎఫెక్ట్: ‘టిక్‌టాక్’‌కు గుడ్ బై.. ‘చింగారీ’ యాప్ వైపు మొగ్గు, 72 గంటల్లో 5 లక్షల డౌన్‌లోడ్లు…

- Advertisement -

బెంగళూరు: గల్వాన్ లోయలో సైనికుల ఘర్షణతో దేశంలో చైనా వస్తువులు బహిష్కరించాలనే నినాదం ఉపందుకోవడంతోపాటు ఆ దేశ సామాజిక మాధ్యమాలను కూడా భారతీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో చైనాకు చెందిన ‘టిక్‌టాక్’ యాప్‌కు ప్రత్యామ్నాయంగా స్వదేశీ సాంకేతికతతో తయారైన ‘చింగారీ’ యాప్‌ పట్ల మొగ్గుచూపిస్తున్నారు. 

దీంతో ఈ యాప్‌కు ప్రాచుర్యం బాగా పెరిగిపోయింది. జస్ట్ 72 గంటల్లోనే దాదాపు 5 లక్షల మంది భారతీయులు ఈ యాప్‌ను తమ మొబైల్ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకున్నారు. 

ఈ విషయాన్ని సోమవారం ‘చింగారీ’ యాప్ సృష్టికర్తలు బిస్వాత్మా, సిద్దార్థ్‌లు వెల్లడించారు. గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రస్తుతం తమ యాప్ ట్రెండింగ్‌లో ఉన్నట్లు వారు పేర్కొన్నారు. 

నెటిజన్ల నుంచి తాము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వస్తున్నట్లు చెప్పారు. జూన్ 10 నాటికి తమ యాప్‌ను లక్ష మందికిపైగా డౌన్‌లోడ్ చేసుకున్నారని, ఇప్పుడు ఆ సంఖ్య విపరీతంగా పెరిగినట్లు బిస్వాత్మా, సిద్దార్థ్‌లు తెలిపారు. 

లడఖ్ వద్ద గల్వాన్ లోయలో ఈ నెల 15న జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనిలకులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు కూడా అమరుడయ్యాడు. 

ఈ ఘటన తర్వాత నుంచి దేశ వ్యాప్తంగా ప్రజల్లో చైనా పట్ల, చైనా వస్తువుల పట్ల తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది. ప్రజలు చైనా వస్తువులను బహిష్కరిస్తుండగా, పలువురు వ్యాపారులు వాటిని అమ్మరాదని నిర్ణయించుకున్నారు. 

ఈ ప్రభావం ఇప్పుడు చైనాకు చెందిన సామాజిక మాధ్యమాలపైనా పడింది. దీంతో ‘టిక్‌టాక్’కు ప్రత్యామ్నాయంగా దేశీయంగా రూపొందించిన ‘చింగారీ’ యాప్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. 

చదవండి: చైనా కంపెనీలకు షాక్ ఇచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం.. రూ.5 వేల కోట్ల ఒప్పందాలు నిలిపివేత
- Advertisement -