25 C
Hyderabad
Saturday, August 29, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం షాకింగ్: నేపాల్‌లో మహా విలయం.. క్షణాల్లో తుడిచిపెట్టుకుపోయిన ఊళ్లు! ఏం జరిగింది?

షాకింగ్: నేపాల్‌లో మహా విలయం.. క్షణాల్లో తుడిచిపెట్టుకుపోయిన ఊళ్లు! ఏం జరిగింది?

- Advertisement -

ఖాట్మండు, 27 ఆగస్టు, 2026: నేపాల్‌పై బుధవారం ప్రకృతి విరుచుకుపడింది. వర్షాలు ఏమీ లేకపోయినా ఉన్నట్లుండి ఉవ్వెత్తున వరద ఎగసి పడడంతో నేపాల్ మధ్య ప్రాంతంలోని పట్టణాలు, గ్రామాలు జలసమాధి అయ్యాయి.

ఈ వరద ప్రవాహం ధాటికి నేపాల్‌లోని వంతెనలు, భవనాలు కొట్టుకుపోయాయి. కొన్ని వందల మంది మృత్యువు బారిన పడగా వేల మంది గల్లంతయ్యారు. మరణించిన, గల్లంతైన వారిలో భారతీయులు, ప్రవాసులు కూడా ఉన్నారు.

జల విలయం ధాటికి నేపాల్‌లో పదుల సంఖ్యలో జల విద్యుత్తు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో అంధకారం అలముకుంది.

నేపాల్‌లో జరిగిన ఈ దుర్ఘటన సమాచారం తెలియగానే భారత ప్రధాని నరేంద్ర మోదీ.. నేపాల్ ప్రధాని బాలేంద్ర షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

అసలేం జరిగిందంటే…

బుధవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో టిబెట్‌లోని గోసాయిన్ కుండ ప్రదేశంలో తీవ్ర భూకంపం సంభవించిందని, ఆ ధాటికి టిబెట్-నేపాల్ సరిహద్దులోని హిమానీనదం ఒక్కసారిగా విరిగి పడడంతో ఈ విలయం చోటుచేసుకున్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది.

దీంతో లిండే నది ఒక్కసారిగా ఉప్పొంగంతో వరద నీరు భారీగా నేపాల్ సరిహద్దులోని భోటే కోషి నది గుండా త్రిశూలి నదిలోకి ప్రవేశించిందని, ఆ వెంటనే నేపాల్‌లోని రసువా, ధాడింగ్ జిల్లాలపై విరుచుకుపడింది.

అక్కడితో ఆగక తూర్పు జిల్లాలైన నువాకోట్, చితావన్, గూర్ఖా, తనాహు, నవాల్ పారసీ జిల్లాలను తుడిచిపెట్టేసింది. ఈ వరదల ధాటికి నేపాల్‌లోని 7 జిల్లాలు ఘోరంగా దెబ్బతిన్నాయి.

ఈ వరద ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న రసువా జిల్లా నేపాల్ రాజధాని నగరం ఖాట్మండుకు 125 కిలో మీటర్ల దూరంలో ఉంది.

పరుగులు తీసినా.. ప్రాణాలు మిగల్లేదు

వరద వస్తున్న శబ్దం విని ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రజలు పరుగులు తీశారు. అయినా దూసుకొచ్చిన వరద నీరు, బురద వందల సంఖ్యలో ప్రజలను కప్పేసింది. మరోవైపు వేల సంఖ్యలో ప్రజలు గల్లంతైనట్లు సమాచారం అందుతోంది.

పొడవైన వంతెన సైతం రెండుగా చీలిపోయిందంటే.. నాలుగంతస్తుల భవనం వరద నీటిలో కొట్టుకుపోయిందంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ వరద ధాటికి 384 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే 8 జల విద్యుత్తు కేంద్రాలు ధ్వంసం అయినట్లు, అలాగే నిర్మాణంలో ఉన్న మరో 4 జల విద్యుత్తు కేంద్రాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం.

ఈ వరద ధాటికి టిబెట్ సరిహద్దు ప్రాంతాలూ తీవ్రంగా దెబ్బతిన్నాయి. అక్కడి రోడ్లు, కమ్యూనికేషన్ సిస్టం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. టిబెట్‌లో ముగ్గురు మరణించగా దాదాపు 300 మంది గల్లంతైనట్లు సమాచారం.

 

- Advertisement -