
హైదరాబాద్, 28 ఆగస్టు 2026: అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలు, వారి మధ్య ఉండే బంధాన్ని వెల్లడించే పండుగ ‘రక్షాబంధన్’. ‘రక్ష’ అంటే రక్షణ, ‘బంధన్’ అంటే బంధం అని అర్థం. ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు.
ఆ రోజున సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి వారి దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, ఆనందం ఆకాంక్షిస్తే.. సోదరులు వారికి బహుమతులు ఇస్తూ.. జీవితాంతం రక్షణగా నిలబడతామని, ఎలాంటి పరిస్థితిలో అయినా కాపాడతామని హామీ ఇస్తారు. అందుకే రాఖీని రక్షణకు ప్రతీకగా భావిస్తారు.
అయితే అసలు ఈ రక్షాబంధన్ పండుగ ఎప్పుడు ఎలా ప్రారంభమైంది? రాఖీ కట్టే సంప్రదాయం వెనుక ఉన్న చరిత్ర ఏమిటో, మన పురాణాలు ఏం చెబుతున్నాయో, రాఖీ పండుగ విశిష్టత ఏమిటో తెలుసుకుందాం..
పురాణాల ప్రకారం…
రాఖీ పండుగ పుట్టుకకు సంబంధించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. హిందూ పురాణాలు, ఇతిహాసాల్లో రక్షా సూత్రం గురించి కొన్ని కథనాలు కనిపిస్తాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి–బలి చక్రవర్తి, దేవేంద్రుడు–శచీదేవి, శ్రీకృష్ణుడు–ద్రౌపది కథలు రక్షా బంధన్ సంప్రదాయంతో ముడిపడి ఉన్నాయి.
లక్ష్మీదేవి–బలి చక్రవర్తి కథ
మరో ప్రసిద్ధ పురాణ కథనం ప్రకారం.. ఓసారి శ్రీమహా విష్ణువు బలి చక్రవర్తికి ఇచ్చిన మాటకు కట్టుబడి పాతాళంలో ఉండాల్సి వస్తుంది. దీంతో లక్ష్మీదేవి ఆందోళన చెందుతుంది.
శ్రావణ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి మారువేషంలో బలి చక్రవర్తి వద్దకు వచ్చి.. అతడి చేతికి రక్షా సూత్రం కడుతుంది. దీంతో సంతోష భరితుడైన బలి చక్రవర్తి ఆమెను ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు.
అప్పుడు లక్ష్మీదేవి తన నిజ స్వరూపం అతడికి కనబరిచి.. తన భర్త విష్ణుమూర్తిని తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరింది. ఆమెను తన సోదరిగా భావించిన బలి చక్రవర్తి ఆమె కోరికను మన్నించి విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్లేందుకు అనుమతించాడని కథనం.
దేవేంద్రుడు-శచీదేవి కథ
భవిష్య పురాణం కథనం ప్రకారం.. పూర్వం దేవతలు, రాక్షసుల మధ్య పుష్కరకాలం యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో దేవతలకు అధిపతియైన దేవేంద్రుడు ఓటమిపాలై, దేవతలతోపాటు అమరావతికి తిరిగి వచ్చి తలదాచుకుంటాడు.
రాక్షస రాజు అమరావతిని దిగ్భంధనం చేయడానికి బయలుదేరాడని తెలుసుకున్న దేవేంద్రుడి భార్య శచీదేవి.. తన భర్త నిస్సహాయతను గుర్తించి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి తరుణోపాయం అడుగుతుంది.
అప్పుడు విష్ణువు ఒక రక్షా సూత్రాన్ని ఆమెకు అనుగ్రహిస్తాడు. అది తీసుకుని తిరిగి వచ్చిన శచీదేవి.. దేవేంద్రుడు మళ్లీ రాక్షసులతో తిరిగి యుద్ధానికి సిద్ధమవుతున్న సమయంలో పవిత్రమైన ఆ రక్షా సూత్రాన్ని భర్త చేతికి కడుతుంది. ఆ రోజు శ్రావణ పౌర్ణమి.
ఆ తరువాత యుద్ధంలో దేవేంద్రుడు, దేవతలు రాక్షసులపై విజయం సాధిస్తారు. సమరంలో గెలిచిన దేవేంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు.
ఆ రక్షా సూత్రం అతడికి రక్షణ, ధైర్యాన్ని అందించిందని.. అదే రాక్షసులపై దేవతల గెలుపునకు కారణమని భవిష్య పురాణం చెబుతుంది. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షా బంధనమే నేటికీ ఒక ఆచారంగా వస్తోందన్నమాట.
శ్రీకృష్ణుడు–ద్రౌపది కథ
రక్షాబంధన్‌కు సంబంధించిన మరో కథ మహాభారత కాలానికి సంబంధించినది. శిశుపాలుడిని సంహరించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు శ్రీకృష్ణుడి వేలికి గాయం అయి రక్తం రావడం చూసిన ద్రౌపది ఆదుర్దాతో వెంటనే తన చీర చెంగును చించి కృష్ణుడి వేలికి కడుతుంది.
ద్రౌపది చూపిన ఆప్యాయతకు ఎంతగానో సంతోషించిన శ్రీకృష్ణుడు ఆమెకు ఏ ఆపద ఎదురైనా తనను తలుచుకోమని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆమెను రక్షిస్తానని మాట ఇస్తాడు.
తరువాత కౌరవ సభలో ద్రౌపదికి అవమానం ఎదురైనప్పుడు.. అన్నా అంటూ ఆమె తనను కాపాడమని కృష్ణుడిని తలుచుకోగానే.. దూరంలో ఉండి కూడా చీరలిచ్చి.. దుశ్శాసనుడి దురాగతం నుంచి ఆమెను రక్షించడం అందరికీ తెలిసిందే.
రాఖీ అంటే.. కేవలం దారం కాదు
నేటి రోజుల్లో రాఖీ అంటే కేవలం దారం కాదు. అది ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, పరస్పర రక్షణకు ప్రతీక. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు ఈ రాఖీ పండుగను ఎంతో ఇష్టంగా జరుపుకుంటున్నారు.
ఆ రోజు అక్క చెల్లెళ్లు తమ సోదరుల ఇళ్లకు వెళ్లి.. నుదిటిన కుంకుమ బొట్టు పెట్టి, గంధం పూసి, చేతికి రాఖీ కట్టి.. మిఠాయి తినిపిస్తారు. తమ సోదరుల ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుష్షు కోసం ఆకాంక్షిస్తారు.
అన్నదమ్ములు కూడా తమ సోదరీమణులకు జీవితాంతం అండగా ఉంటామని మాటిస్తూ.. వారికి బహుమతులు అందజేస్తారు.
రక్తసంబంధం లేకపోయినా.. ఆత్మీయత, స్నేహం, గౌరవంతో ఏర్పడిన బంధాలకు కూడా రాఖీ కట్టే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. అందుకే రక్షాబంధన్ అనేది కేవలం ఒక పండుగ కాదు.. అది పరస్పరం గౌరవించుకోవడం, కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం, తమ మధ్య ఉన్న సోదర బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి గుర్తు.








