
హైదరాబాద్, 1 సెప్టెంబర్ 2026: వెనకబడిన తరగతుల సాధికారత సంస్థ (బీసీసీఈ) 12వ వార్షికోత్సవం ఈనెల 6వ తేదీ (ఆదివారం)న హైదరాబాద్ కోఠీలోని కందస్వామి లేన్‌లో గల సంస్థ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు బీసీసీఈ ఇన్‌ఛార్జి, సీనియర్ జర్నలిస్టు ఇంద్రవెల్లి రమేష్ తెలియజేశారు.
బీసీసీఈ ఛైర్మన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హోమ్ శాఖ మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యులు శ్రీ తూళ్ల దేవేందర్ గౌడ్ అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో మహనీయుల గాధల హిందీ, ఇంగ్లీషు అనువాద పుస్తకాల ఆవిష్కరణ జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ విచ్చేయనున్నట్లు, అలాగే జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ మాజీ ఛైర్మన్, రిటైర్డ్ జస్టిస్ వి.ఈశ్వరయ్య విశిష్ట అతిథిగా పాల్గొంటారని కార్యక్రమానికి సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్న ఇంద్రవెల్లి రమేష్ తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథులుగా తెలంగాణ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ శ్రీ రియాజ్, ఢిల్లీ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు శ్రీ ఇనుకొండ తిరుమలి, అలాగే ప్రముఖ అంబేద్కరిస్టు శ్రీ జె.బి.రాజు తదితరులు కూడా పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు.








