
ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కుమార్తె జనని వివాహ వేడుక ఆదివారం (ఆగస్టు 16) హైదరాబాద్ రాయదుర్గంలోని జేఆర్‌సీ (JRC) కన్వెన్షన్‌లో అత్యంత వైభవంగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్య తేజతో జనని వివాహం బంధుమిత్రుల సమక్షంలో శాస్త్రోక్తంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హాజరై నవ దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి సంతోషకరమైన వైవాహిక జీవితం సాగాలని ఆకాంక్షించారు. ఈ శుభకార్యానికి సీఎంతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
రాజకీయంగా విభిన్న ప్రాధాన్యతలు ఉన్నప్పటికీ, బండ్ల గణేశ్ పిలుపు మేరకు రెండు తెలుగు రాష్ట్రాల అగ్ర నేతలు ఈ పెళ్లికి హాజరు కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తన సతీమణి భువనేశ్వరితో కలిసి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. వీరే కాకుండా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున వంటి టాలీవుడ్ ప్రముఖులు కూడా విచ్చేసి సందడి చేశారు.








