
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని యర్రావారిపాలెం, మూలపల్లి తదితర సరిహద్దు గ్రామాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తూ పంట పొలాలను ధ్వంసం చేయడం స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి వచ్చిన సుమారు 30 ఏనుగులు రాత్రివేళల్లో వరి, టమోటా, కొబ్బరి పంటలను నాశనం చేయడమే కాకుండా రైతులపై దాడులకు తెగబడుతుండటంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ వెంటనే స్పందించి రంగంలోకి దిగారు.
ఏనుగుల సంచారంపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఆయన ఆదివారం అత్యవసర టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… ఏనుగుల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు డ్రోన్ కెమెరాలను ఉపయోగించాలని, ఎప్పటికప్పుడు వాటి ప్రయాణ మార్గాలను గుర్తించి గ్రామస్తులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
డ్రోన్లు & రాత్రి గస్తీ: అటవీ సరిహద్దు గ్రామాల్లో ప్రత్యేక రాత్రి గస్తీ (Night Patrols) ఏర్పాటు చేయాలని, డ్రోన్లతో ఏనుగుల రూట్‌ను ట్రాక్ చేయాలని ఆదేశించారు.
‘హనుమాన్’ బృందాల మోహరింపు: పరిస్థితి తీవ్రతను బట్టి ప్రజల రక్షణ కోసం వెంటనే ప్రత్యేక ‘హనుమాన్’ వైల్డ్‌లైఫ్ రెస్క్యూ టీమ్‌లను రంగంలోకి దించాలని సూచించారు.
శాఖల సమన్వయం: అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా పనిచేస్తూ ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
రైతులకు నష్టపరిహారం: ఏనుగుల దాడిలో పంటలు నష్టపోయిన రైతులకు అటవీశాఖ ద్వారా తక్షణమే నష్టపరిహారం అందించేందుకు నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
లౌడ్‌స్పీకర్లు, మొబైల్ మెసేజ్‌ల ద్వారా ప్రజలను నిరంతరం హెచ్చరించాలని, రాత్రి సమయాల్లో పొలాలకు వెళ్లకుండా రైతులకు అవగాహన కల్పించాలని పవన్ కల్యాణ్ అధికారులను కోరారు.








