
అమరావతి: ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నకిలీ పోలీసులతో ర్యాలీలు నిర్వహిస్తూ ఆ పార్టీ నాయకులు రాష్ట్ర ఖాకీ వ్యవస్థ గౌరవాన్ని, విశ్వసనీయతను తీవ్రంగా అవమానిస్తున్నారని మండిపడ్డారు. కేవలం రాజకీయ ప్రయోజనాలు పొందడం, ప్రజలను తప్పుదోవ పట్టించడమే ధ్యేయంగా వైసీపీ దిగజారుడు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
నకిలీ పోలీసుల ముసుగులో ర్యాలీలు చేస్తూ సమాజానికి ఎలాంటి సందేశమివ్వాలని చూస్తున్నారని మంత్రి సూటిగా ప్రశ్నించారు. ముసుగులు ధరించి క్రిమినల్ రాజకీయాలు చేసేవారికి అసలు రాజకీయంలో కొనసాగే నైతిక అర్హతే లేదని స్పష్టం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ వ్యవస్థల పరువు తీయాలని చూస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని తేల్చి చెప్పారు. ఈ ఘటనలో నేరుగా పాల్గొన్న నకిలీ పోలీసులతో పాటు, వెనుకుండి నడిపించిన వైసీపీ అసలు సూత్రధారులపైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.








