25.7 C
Hyderabad
Monday, August 17, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఏపీకి రూ. 2.08 లక్షల కోట్ల పెట్టుబడుల వరద: 25 ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం!

ఏపీకి రూ. 2.08 లక్షల కోట్ల పెట్టుబడుల వరద: 25 ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం!

tdp-chief-chandrababu-naidu
- Advertisement -

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా కూటమి ప్రభుత్వం మరో చారిత్రాత్మక ముందడుగు వేసింది. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశంలో భారీ పెట్టుబడి ప్రతిపాదనలకు ఏకగ్రీవ ఆమోదముద్ర లభించింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఇంధనం, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి కీలక రంగాల్లో మొత్తం 25 మెగా ప్రాజెక్టులకు గాను రూ. 2,08,406 కోట్ల విలువైన పెట్టుబడులకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్షంగానే 21,627 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అధికారులకు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలను (ఇన్సెంటివ్‌లు) మరింత పారదర్శకంగా అందించేందుకు ఈ ఏడాది డిసెంబరు నుంచి ‘ఎస్క్రో ఖాతాలు’ (Escrow Accounts) నిర్వహిస్తూ నేరుగా నిధులు జమ చేసే విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. అలాగే, పరిశ్రమల స్థాపన కేవలం నగరాలకే పరిమితం కాకుండా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలకు విస్తరించాలని, లిథియం బ్యాటరీలు, డేటా సెంటర్లు, రోబోటిక్స్ వంటి భవిష్యత్ (New-Age) సాంకేతిక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.

ఆమోదం పొందిన ప్రధాన ప్రాజెక్టులు & జిల్లాలు

డేటా సెంటర్లు & ఐటీ: అనకాపల్లి జిల్లాలో ‘రెన్యూ ఏపీ గ్రీన్ డేటా సెంటర్’ రూ. 85,200 కోట్ల వ్యయంతో (1,880 ఉద్యోగాలు) భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. అలాగే విశాఖపట్నంలో ‘డేటా సెంటర్ హోల్డింగ్స్ ఇండియా’ రూ. 58,743 కోట్లు, ‘ఏఎం ఇంటెలిజెన్స్ ల్యాబ్స్’ రూ. 31,387 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి.

క్లీన్ & గ్రీన్ ఎనర్జీ: కాకినాడ జిల్లాలో ‘వారీ క్లీన్ ఎనర్జీ’ రూ. 15,000 కోట్లతో ప్లాంట్ నిర్మించనుండగా, కర్నూలు జిల్లాలో ‘అగస్త్యా గ్రీన్ ఎనర్జీ’ రూ. 7,799 కోట్లు, ‘జాక్సన్ గ్రీన్’ రూ. 1,533 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి.

ఉపాధి కల్పనలో డిక్సన్ ముందంజ: కడప జిల్లా కొప్పర్తిలో ఏర్పాటుకానున్న ‘ఏఐఎల్ డిక్సన్ ఇండియా లిమిటెడ్’ రూ. 450 కోట్ల పెట్టుబడితో ఏకంగా 7,000 మందికి అత్యధికంగా ఉద్యోగాలు కల్పించబోతోంది.

ఇతర కీలక రంగాలు: శ్రీకాకుళం జిల్లా మూలపేట వద్ద ‘కోరమాండల్ ఇంటర్నేషనల్’ రూ. 2,125 కోట్లు, కుప్పంలో ‘హిందాల్కో ఇండస్ట్రీస్’ రూ. 880 కోట్లు, తిరుపతి జిల్లాలో ‘మునోథ్ లీథియం బ్యాటరీ’ రూ. 500 కోట్లతో తమ యూనిట్లను నెలకొల్పనున్నాయి. ఇవే కాకుండా తిరుపతి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో పలు స్టార్ హోటళ్లు, హాస్పిటాలిటీ ప్రాజెక్టులకు బోర్డు అనుమతులిచ్చింది.

- Advertisement -