
ముంబై: బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా, ఆయన భార్య సునీతా ఆహుజాల మధ్య సాగుతున్న వ్యక్తిగత విభేదాలు మరోసారి తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల కొత్త నటి కోమల్ రాణి స్వర్ణకర్‌తో కలిసి గోవిందా విమానాశ్రయంలో కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో, దీనిపై సునీతా ఆహుజా అత్యంత ఘాటుగా స్పందించారు.
పాపారాజీలు ఈ వ్యవహారంపై సునీతను ప్రశ్నించగా… “వినాశకాలే విపరీత బుద్ధి.. ఆయన బుద్ధి పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. అందుకే ఇలాంటి పనులు చేస్తున్నారు” అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో గోవిందాపై తాను లైంగిక ఆరోపణలు, మోసం చేశాడనే వ్యాఖ్యలు చేసినప్పుడు తన్నే ట్రోల్ చేసిన అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన ఆమె… “హీరో నంబర్ 1 ఇప్పుడు చీటర్ నంబర్ 1 అయ్యాడని నెటిజన్లు అంటున్నారు. మరి నన్ను ట్రోల్ చేసిన ఆయన అభిమానులు, మీడియా ఇప్పుడు ఏమంటారో వాళ్లనే అడగండి. నాకేమీ సంబంధం లేదు” అని వ్యాఖ్యానించారు.
కాగా, గోవిందా ఇటీవలే తన రాబోయే చిత్రం ‘రూపా’ ద్వారా కోమల్ రాణి స్వర్ణకర్‌ను నూతన కథానాయికగా పరిచయం చేశారు. ఆమెతో కలిసి పబ్లిక్‌గా కనిపించడం, ప్రమోషన్లలో పాల్గొనడం పట్ల సునీత గతంలో చేసిన వ్యాఖ్యలకు ముడిపెడుతూ నెటిజన్లు సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.








