‘యమడు’ మహా అందగాడా? తోడబుట్టిన చెల్లెలే మోహించిందా? ఆ తరువాత ఏం జరిగింది?

Yamadharmaraju
- Advertisement -

Yamadharmaraju

దక్షప్రజాపతి కూతుళ్లలో సంజ్ఞాదేవి ఒకతె. ఆమె సూర్యభగవానుణ్ని పెళ్లాడింది. ఆమెకు వైవస్వతుడు, యముడు అని ఇద్దరు కొడుకులు, యమి అనే కూతురు కలిగారు. యమ ధర్మరాజు దక్షిణ దిక్పాలకుడు. చిత్ర గుప్తుడు ఈయన దగ్గర చిట్టాలు వ్రాసే సేవకుడు. సకల జీవరాశుల పాపపుణ్యాలను బేరీజు వేసి శిక్షించడమే యముడి పని .

ఛాయాదేవి యముడి సవతి తల్లి..  ఆమెకు సావర్ణి, శని అనే ఇద్దరు కొడుకులు కలిగారు. అంతవరకు తన సవతి బిడ్డలను సొంత బిడ్డలలాగా చూసుకుంటున్న ఛాయాదేవి, తనకు పిల్లలు పుట్టగానే, భేద బుద్ధితో చూడటం ఆరంభించింది. ఆమె పక్షపాత వైఖరిని సహించలేక, ధర్మం అంటే ప్రాణమైనా ఇచ్చే యముడు, ఒకనాడు తన సవితి తల్లిని కాలితో తన్నాడు. అందుకు ఆమె కోపంతో ‘నన్ను తన్నిన నీ కాళ్లకు కుష్ఠురోగం ప్రాప్తించుగాక!’ అని శపించింది.

తోడబుట్టిన అన్ననే మోహించిన చెల్లి…

సంజ్ఞాదేవి కూతురైన యమికి పెళ్లీడు వచ్చింది. ఆమె అతిలోక సౌందర్యవతి. ఆమె తండ్రివెంట సూర్య రథంలో తిరుగుతూ తనతో తులతూగే అందగాడి కోసం ముల్లోకాలను గాలించింది. యుముడు ఒకనాడు ‘చెల్లీ! నీకు తగిన అందగాడు దొరికాడా, లేదా? దొరికితే వాడు ఎవరో, ఎక్కడున్నాడో చెప్పు’ అని అడిగాడు. అందుకు యమి ‘అన్నా! నీకంటే అందగాడు నాకు ఎక్కడా కనిపించలేదు, అందుచేత నిన్నే పెళ్లి చేసుకోవాలని కోరికగా ఉంది’ అన్నది.

చెల్లెలు తనతో పరిహాసమాడుతున్నదని యముడు సిగ్గుపడ్డాడు. కానీ ఆమె తన పాదాలమీదపడి, ప్రాధేయపడేసరికి, నిర్ఘాంత పోయాడు. అతనికి కోపం వచ్చింది, ‘తెలివి తక్కువ దానా! తోడబుట్టిన వాడినే కామిస్తావా? రాక్షసికి కూడా ఇలాంటి కోరిక కలగదే! నీకు పెళ్లీలేదు, పెడాకులూ లేవు. భూలోకంలో నదిగాపుట్టి నీలాంటి పాపాత్ముల పాపాలు కడుగుతూ ఉండు’ అని ఆమెను శపించాడు.

అందుకు యమి ఏడుస్తూ కోపంతో ‘నచ్చిన వాడికి పెళ్లాం కాలేకపోతే నదిగా, ఉండటమే మేలు నేను నీ చెల్లెలినే! శాపం ఇయ్యటంలో నీకంటే తక్కువ తిన్నాననుకున్నావా? నువ్వు కాలం తీరకుండానే చస్తావు పో!’ అని ప్రతి శాపం ఇచ్చింది. యముడి శాపకారణంగా, ఆమె హిమాలయాలలో యమునా నదిగా పుట్టి రోదనా స్వరంతో పర్వతాల నుంచి కింది దూకి మైదానంలో ప్రవహిస్తుండగా గంగానది ఆమెను ఓదార్చి, తనలో కలుపుకొని పవిత్రురాలిని చేసింది.

తపస్సు చేసి.. రూపం మార్చుకుని…

తన రక్తం పంచుకొని పుట్టిన చెల్లిలికే పాప చింత కలిగించిన తన అందం పట్ల యముడికి ఏహ్యా భావం కలిగింది. అతను శివుడి కోసం తపస్సు చెయ్యగా పార్వతీ పరమేశ్వరులు, ప్రత్యక్షమయ్యారు.  ‘పరవమేశ్వరా! ఈ అందం నాకు వద్దు. స్త్రీలు, పురుషులూ నన్ను చూడగానే జడుసుకునేలా భయంకర రూపాన్ని ప్రసాదించు. ఇంకేమీ వద్దు!’ అని కోరుకున్నాడు యముడు.

నరకానికి అధిపతియై…

తరువాత బ్రహ్మ జీవుల పాప పుణ్యాలను విచారించి తగిన విధంగా శిక్షించటానికి, దక్షిణ దిక్కున నరకం అనే పేరుతో ఒక న్యాయ పీఠాన్ని విశ్వకర్మచేత నిర్మింపజేశాడు. ధర్మబుద్ధి సమదృష్టీ కలవాడు, దయా దాక్షిణ్యాలు లేనివాడు, ప్రలోభాలకు లొంగనివాడు ఎవడో వాడే దక్షిణ దిక్కుకు, నరకానికీ, అందులోని న్యాయపీఠానికీ అధిపతిగా ఉండటానికి అర్హుడు.

అలాంటి వాడెవడో తేల్చటానికి త్రిమూర్తులు ముగ్గురూ సమావేశమై, దేవతలతో చర్చించి చివరకి యముడు ఒక్కడే ఆ స్థానానికి తగినవాడు అని తేల్చారు. యుముడు దక్షిణ దిక్కుకు పాలకుడై శ్యామలాదేవిని పెళ్లాడి, నరకలోకంలోని సమ్యమనీ నగరంలో నివసిస్తూ, దండపాశాలు ధరించి, మహిష వాహనారూఢుడై తిరుగుతూ, పాప పుణ్యాలను విచారించి తీర్పులు చెప్పటంలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు.

– ఎం. ప్రవీణ్ కుమార్

- Advertisement -