
విజయనగరం: ఉత్తరాంధ్ర విమానయాన రంగానికి సంబంధించి చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ నుంచి వాణిజ్య విమాన సర్వీసులు ఆదివారం (ఆగస్టు 16) అర్ధరాత్రి 12:01 గంటల నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ వర్గాలు, జిఎంఆర్ (GMR) యాజమాన్యం అధికారిక విమాన సర్వీసుల షెడ్యూల్‌ను ఖరారు చేశాయి.
ఈ మార్పుతో దాదాపు 30 ఏళ్లకు పైగా సేవలందించిన విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లోని (ఐఎన్ఎస్ డేగా) సాధారణ సివిల్ కమర్షియల్ విమానాల రాకపోకలు నేటి అర్ధరాత్రితో పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఇప్పటివరకు విశాఖ విమానాశ్రయానికి ఉన్న అంతర్జాతీయ ట్రావెల్ కోడ్ ‘VTZ’ ఇకపై భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌కే బదిలీ కానుంది.
తొలిరోజే 31 సర్వీసులు
తొలిరోజైన సోమవారం (ఆగస్టు 17) భోగాపురం ఎయిర్‌పోర్ట్ నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్ ఏకంగా 31 విమాన సర్వీసులను నడపనుంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, తిరుపతి నగరాలకు ఈ విమానాలు రాకపోకలు సాగిస్తాయి. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) ఇప్పటికే విమానాశ్రయ భద్రతా బాధ్యతలను స్వీకరించింది.
ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యాటకం, వ్యాపారం, ఐటీ ఎగుమతులు మరియు ఉపాధి అవకాశాలు మరింత ఊపందుకుంటాయని భావిస్తున్నారు.








