25.2 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: ఫోన్ల లాకింగ్‌కు చెక్!

బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: ఫోన్ల లాకింగ్‌కు చెక్!

rbi
- Advertisement -

ముంబై: వ్యక్తిగత రుణాలు (Personal Loans), ఇతర బకాయిల వసూలు కోసం రుణగ్రహీతలను (Borrowers) తీవ్ర ఇబ్బందులకు గురిచేసే బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గట్టి షాక్ ఇచ్చింది.

లోన్ ఈఎంఐలు ఎగ్గొట్టారనే నెపంతో వినియోగదారుల మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లను రిమోట్‌గా డిజేబుల్ (Remote Locking) చేయడం లేదా బ్లాక్ చేయడం కుదరదని తేల్చి చెప్పింది.

రుణగ్రహీతల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుతూ ఆర్‌బీఐ సంచలన నూతన రికవరీ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.

పర్సనల్ లోన్లకు ఫోన్లు లాక్ చేయడం కుదరదు!
సాధారణంగా బ్యాంకులు లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (NBFCs) నుంచి పర్సనల్ లోన్, హోమ్ లోన్ లేదా కార్ లోన్ తీసుకుని ఈఎంఐ చెల్లించకపోతే.. కొందరు రికవరీ ఏజెంట్లు కస్టమర్ల స్మార్ట్‌ఫోన్లను రిమోట్‌గా లాక్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు ఆర్‌బీఐ దృష్టికి వచ్చింది.

దీనిపై కఠినంగా స్పందించిన ఆర్‌బీఐ, సాధారణ పర్సనల్ లోన్లు లేదా ఇతర రుణాలకు బకాయిపడితే కస్టమర్ల డివైజులను లాక్ చేయడం పూర్తిగా చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది.

మినహాయింపు: సదరు మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ లేదా ట్యాబ్ కొనుగోలు కోసమే ప్రత్యేకంగా రుణం (Device Finance) పొంది ఉంటే మాత్రం.. కొన్ని నిర్దిష్ట షరతులతో డిజేబుల్ చేసే అవకాశం ఉంది.

డివైజ్ ఫైనాన్స్ రుణాలకూ కఠిన నిబంధనలు!
ఫోన్ కొనుగోలు చేయడానికి తీసుకున్న లోన్ ఎగవేసినప్పటికీ బ్యాంకులు ఇష్టారీతిన వెంటనే లాక్ చేయడానికి వీల్లేదు:

30 రోజుల గడువు: ఈఎంఐ గడువు దాటిన తర్వాత కనీసం 30 రోజుల పాటు ఎలాంటి చెల్లింపులు జరగనప్పుడు మాత్రమే పాక్షిక పరిమితులు విధించాలి.

60 రోజుల నాన్-పేమెంట్: 60 రోజులు దాటినా చెల్లించకపోతేనే పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించవచ్చు.

ఇన్‌కమింగ్, అత్యవసర సేవలు ఆపకూడదు: ఫోన్ లాక్ చేసినప్పటికీ ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్ (SMS), అత్యవసర ఎస్‌ఓఎస్ (SOS) సేవలు, ఉద్యోగానికి సంబంధించిన కీలక ఫీచర్లను బంద్ చేయడానికి వీల్లేదు.

డేటా దొంగిలించడం నిషిద్ధం: లాక్ చేసే పేరుతో కస్టమర్ల కాంటాక్టులు, ఫోటోలు, వీడియోలు, లొకేషన్ వివరాలను బ్యాంకులు లేదా ఏజెంట్లు సేకరించకూడదు.

గంటకు రూ. 250 ఫైన్: బకాయిలు చెల్లించిన గంట వ్యవధిలోనే డివైజ్‌ను రీ-యాక్టివేట్ చేయాలి. ఆలస్యమైతే ఆలస్యమైన ప్రతి గంటకు బ్యాంకు కస్టమర్‌కు రూ. 250 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

రికవరీ ఏజెంట్ల ఆగడాలకు చెక్!
బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టిన వారిని వేధించే రికవరీ ఏజెంట్ల ప్రవర్తనపైనా ఆర్‌బీఐ విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

రికవరీ ఏజెంట్లు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్యలో మాత్రమే ఫోన్ కాల్స్ లేదా ఇంటికి వెళ్లాలి.

రుణగ్రహీతల కుటుంబంలో మరణాలు, వైద్య అత్యవసర పరిస్థితి (Medical Emergency), పెళ్లిళ్ల సమయంలో వేధించకూడదు.

ప్రతి ఫోన్ కాల్‌ను బ్యాంకులు రికార్డ్ చేసి కనీసం 6 నెలల పాటు భద్రపరచాలి.

ఫోటోలు, ఆడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మానసికంగా వేధించడం పూర్తిగా నిషేధం.

ఈ కొత్త నిబంధనలతో రుణగ్రహీతలకు రక్షణ లభించడంతో పాటు రికవరీ ఏజెంట్ల అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది.

- Advertisement -