28.2 C
Hyderabad
Monday, November 23, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం మమతా బెనర్జీ కాన్వాయ్‌పై దాడి: హెలికాప్టర్ షాట్ వేగంతో రాళ్లు, బూట్లు విసిరిన నిరసనకారులు!

మమతా బెనర్జీ కాన్వాయ్‌పై దాడి: హెలికాప్టర్ షాట్ వేగంతో రాళ్లు, బూట్లు విసిరిన నిరసనకారులు!

- Advertisement -

కోల్‌కతా / హలీషహర్: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రయాణిస్తున్న వాహనంపై ఉత్తర 24 పరగణాల జిల్లా హలీషహర్ సమీపంలో ఆదివారం అనూహ్య దాడి జరిగింది.

కంచ్‌రాపారా మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ జెన్నీ శర్మ భర్త, పోలీస్ కస్టడీలో అనుమానాస్పద స్థితిలో మరణించిన టిఎంసి కార్యకర్త బిర్జూ కేఓట్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

గుమిగూడిన నిరసనకారులు మమతా బెనర్జీ కారును చుట్టుముట్టి ‘చోర్ భగావో’, ‘దకైత్ రాణి’ అంటూ నినాదాలు చేస్తూ రాళ్లు, బూట్లు, నీళ్ల సీసాలు, బురద విసిరి తీవ్ర ఉద్రిక్తత సృష్టించారు.

“నన్ను చంపేందుకు చూశారు”: మమతా బెనర్జీ ఆందోళన

ఈ దాడిపై మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

“పోలీసుల కళ్లముందే నా కారుపైకి పెద్ద పెద్ద రాళ్లు, ఇటుకలు విసిరారు. ఒకవేళ విండో గ్లాస్‌లు మూసి లేకపోయి ఉంటే, రాయి నా తలకు తగిలి ప్రాణాలు పోయేవి. ఇది నన్ను చంపేందుకు పన్నుతున్న పక్కా ప్లాన్డ్ కుట్ర. నా జీవితంలో ఇలాంటి దాడిని ఎప్పుడూ చూడలేదు. స్థానిక పోలీసులు మ‌మ్మ‌ల్ని రక్షించడంలో పూర్తిగా విఫలమయ్యారు” అని ఆరోపించారు.

ఆమెతో పాటు ఉన్న ఎంపీలు కళ్యాణ్ బెనర్జీ, డోలా సేన్‌లు కూడా యంత్రాంగం వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సువేందు ప్రభుత్వంపై విమర్శలు.. బిజేపి ఖండన

ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆదేశాల మేరకే పోలీసులు పనిచేస్తున్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని టిఎంసి ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు.

అయితే, ఈ ఆరోపణలను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు శమీక్ భట్టాచార్య తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, స్థానిక ప్రజలే మమతా బెనర్జీ రాకను వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేశారని స్పష్టం చేశారు.

హింసను బీజేపీ ఎప్పటికీ ప్రోత్సహించదని, పోలీసులు తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పోలీసు కస్టడీ మరణంపై రాద్దాంతం…

హలీషహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కస్టడీలో ఉన్న బిర్జూ కేఓట్‌ను పోలీసులు విచక్షణారహితంగా చితకబాదడం వల్లే ఆయన మరణించారని ఆయన భార్య, మాజీ కౌన్సిలర్ జెన్నీ శర్మ ఆరోపిస్తున్నారు.

ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకపోయినా ఆయనను పోలీసులు చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకున్నారని టిఎంసి జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సైతం విమర్శించారు.

ఈ ఘటనతో బెంగాల్ వ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర అలజడి నెలకొంది.

- Advertisement -