26.4 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home ట్రెండింగ్ న్యూస్ న‌ల్సార్‌కు సీజేఐ వద్దు: గ్రాడ్యుయేషన్ వేడుకల వేళ హైదరాబాద్‌లో విద్యార్థుల ఆందోళన!

న‌ల్సార్‌కు సీజేఐ వద్దు: గ్రాడ్యుయేషన్ వేడుకల వేళ హైదరాబాద్‌లో విద్యార్థుల ఆందోళన!

- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్‌లోని ప్రముఖ న్యాయ విశ్వవిద్యాలయం ‘న‌ల్సార్’ (NALSAR University of Law) 2026 వార్షిక స్నాత‌కోత్స‌వానికి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలనే ప్రతిపాదనపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

వర్సిటీకి చెందిన 2026 బ్యాచ్‌లోని 450 మందికి పైగా విద్యార్థులు సమష్టిగా సంతకాలు చేసిన ఒక విజ్ఞప్తి పత్రాన్ని వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ఆచార్యులకు అందించారు.

సీజేఐను ముఖ్య అతిథిగా పిలిచే ఆలోచనను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు యాజమాన్యాన్ని గట్టిగా కోరారు.

సీజేఐ వ్యాఖ్యలు, విచారణ తీరుపై విద్యార్థుల అభ్యంతరం…

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూలై 20, 2026న జరిగిన పార్లమెంట్ మార్చ్ ఆందోళనల సందర్భంగా నిరసనకారులపై పోలీసులు సాగించినట్లు చెబుతున్న దౌర్జన్యాలపై దాఖలైన పిటిషన్ల విచారణ సమయంలో సీజేఐ సూర్య కాంత్ వ్యవహరించిన తీరును విద్యార్థులు తమ లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు.

జూలై 23న జరిగిన విచారణలో పోలీసుల దాడికి సంబంధించిన వీడియో ఆధారాలను చూడటానికి సీజేఐ నిరాకరించారని, “మాకు వీడియోలు చూసే ఆసక్తి, సమయం లేవు” అని వ్యాఖ్యానించారని విద్యార్థులు ఆరోపించారు.

మహిళలు, చిన్నారుల సహా 70 మందికి పైగా గాయపడిన తీవ్రమైన అంశంపై పిటిషనర్ న్యాయవాది వాదనలను మధ్యలోనే ముగించారని పేర్కొన్నారు.

ఇదే సందర్భంలో నిరసన తెలుపుతున్న దేశ యువతను ‘బొద్దింకలు’ (Cockroaches) తో పోలుస్తూ సీజేఐ చేసిన వ్యాఖ్యలు తమను తీవ్రంగా గాయపరిచాయని, పోలీసు దౌర్జన్యాలను ఉపేక్షించే వైఖరి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆందోళన వ్యక్తం చేశారు.

రాజ్యాంగ విలువలకు విరుద్ధం…

తమ అభ్యంతరం వ్యక్తులపై కాదని, న్యాయ విశ్వవిద్యాలయంగా నాల్సార్ నేర్పిన రాజ్యాంగ బాధ్యత, పౌర హక్కులు, న్యాయసూత్రాల ప్రాతిపదికన మాత్రమే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని విద్యార్థులు స్పష్టం చేశారు.

“విద్యార్థుల పట్ల తీవ్ర అలసత్వ వహించిన వ్యక్తి చేతుల మీదుగా విద్యా, భావోద్వేగ ప్రాముఖ్యత కలిగిన పట్టాలు అందుకోవడానికి మా మనస్సాక్షి అంగీకరించడం లేదు” అని గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ లేఖలో పేర్కొంది.

కాన్వొకేషన్ తేదీ, ముఖ్య అతిథి ఎంపిక ఇంకా అధికారికంగా ఖరారు కానందున, యాజమాన్యం సరైన నిర్ణయం తీసుకోవాలని, విద్యార్థుల భావాలను గౌరవిస్తూ వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు.

‘టిస్’ కాన్వొకేషన్ వాయిదా నేపథ్యం…

ఇటీవలే ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) కూడా ఆగస్టు 2న జరగాల్సిన తన 86వ కాన్వొకేషన్ వేడుకను చివరి నిమిషంలో వాయిదా వేసింది.

ఆ వేడుకకు కూడా సీజేఐ సూర్య కాంత్ ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. అయితే విద్యార్థుల నుంచి తీవ్ర నిరసనలు, ప్రత్యేకించి ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆందోళనలు తలెత్తే అవకాశం ఉందన్న భద్రతా కారణాలతోనే టిస్ కాన్వొకేషన్‌ను వాయిదా వేసినట్లు సమాచారం.

తాజా పరిణామాలపై న‌ల్సార్ విశ్వవిద్యాలయ యాజమాన్యం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

- Advertisement -