
న్యూఢిల్లీ: భారత్‌లో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు క్రమంగా పెరుగుతున్నాయని, నిరుద్యోగ రేటు వరుసగా తగ్గుముఖం పడుతోందని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు వెల్లడించింది.
పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) వివరాలను ఉటంకిస్తూ… 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసు గల యువతలో నిరుద్యోగ రేటు 2022లోని 10.9 శాతం నుండి 2025 నాటికి 9.9 శాతానికి పడిపోయిందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సభకు తెలిపారు.
అదే సమయంలో వర్కర్ పాపులేషన్ రేషియో (WPR) 38.5 శాతం నుంచి 41.4 శాతానికి పెరిగిందని వివరించారు.
ప్రభుత్వ ఉద్యోగాలు, పథకాల ఊతం…
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ ప్రక్రియను మిషన్ మోడ్‌లో చేపట్టినట్లు మంత్రి స్పష్టం చేశారు. అక్టోబర్ 2022 నుండి నిర్వహించిన 19 రోజ్‌గార్ మేళాల ద్వారా ఇప్పటివరకు 12.5 లక్షలకు పైగా నియామక పత్రాలను పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రధాన్ మంత్రి ముద్రా యోజన, పీఎంఈజీపీ, గ్రామీణ నైపుణ్య యోజన, పీఎం స్వనిధి, స్టాండ్ అప్ ఇండియా వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు.
అలాగే రూ. 99,446 కోట్ల కేటాయింపులతో ప్రారంభించిన ప్రధాన్ మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PM-VBRY) ద్వారా రెండేళ్లలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాల సృష్టిని లక్ష్యంగా పెట్టుకున్నామని నివేదించారు.
తయారీ రంగం, పీఎల్ఐ, ఎంఎస్ఎంఈల పురోగతి
దేశంలో తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు 14 కీలక రంగాల్లో ప్రవేశపెట్టిన ఉత్పత్తి అనుబంధ ప్రోత్సాహక (PLI) పథకాల ద్వారా ఇప్పటికే రూ. 2.40 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, దీని ద్వారా 14.15 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించిందని తెలిపారు.
మరోవైపు ఉద్యోగ కల్పనకు కీలక ఇంజిన్‌గా మారిన MSME రంగానికి చెందిన 8.9 కోట్లకు పైగా సంస్థలు ఉద్యమ్ పోర్టల్‌లో నమోదై, దాదాపు 39 కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తున్నాయని సభకు వివరించారు.
స్టార్టప్‌లు, నైపుణ్యాభివృద్ధి…
డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) ద్వారా ఇప్పటివరకు 2.40 లక్షలకు పైగా స్టార్టప్‌లను గుర్తించినట్లు కేంద్రం ప్రకటించింది. వీటికి ఫండ్ ఆఫ్ ఫండ్స్, సీడ్ ఫండ్ స్కీమ్‌ల ద్వారా ఆర్థిక చేయూతనిస్తున్నామంది.
అంతేకాకుండా, యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు రూ. 60,000 కోట్ల బడ్జెట్‌తో ‘పీఎం-సేతు’ (PM-SETU) పథకాన్ని అమలు చేస్తున్నామని, నేషనల్ కెరీర్ సర్వీస్ (NCS) పోర్టల్ ద్వారా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు, సమాచారం అందుబాటులో ఉంచుతున్నామని మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు.








