పోరాడండి.. అండగా ఉంటాం! జర్నలిస్టుల ’మహాధర్నా‘కు అఖిల పక్షం మద్దతు, జోరువానలోనూ దద్దరిల్లిన ధర్నాచౌక్‌

- Advertisement -

హైదరాబాద్‌: జవహర్ లాల్ నెహ్రూ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ(జేఎన్‌జే మ్యాక్ హెచ్ఎస్)కి చెందిన 70 ఎకరాల స్థలాలు ముమ్మాటికి ఆ సొసైటీ సభ్యులవేనని అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో నినదించాయి.

స్రుపీంకోర్టు తుది తీర్పును అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీరును ఎండగట్టాయి. జేఎన్‌జే హౌసింగ్ సొసైటీ సభ్యులు చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.

మంగళవారం ఇందిరాపార్కు వద్దగల ధర్నాచౌక్‌లో జేఎన్‌జే హౌసింగ్ సొసైటీ ఫౌండర్‌ మెంబర్‌ పివి రమణారావు ఆధ్వర్యంలో టీమ్ జేఎన్‌జే సభ్యులు నిర్వహించిన ‘మహాధర్నా’లో కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఎం, సీపీఐ, ఆమ్‌ ఆద్మీ పార్టీలతోపాటు వివిధ ప్రజాసంఘాలు, జర్నలిస్ట్‌ సంఘాల నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మల్లు రవి మాట్లాడుతూ.. గత నాలుగు దఫాలుగా కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాలే హైదరాబాద్ జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చిన సంప్రదాయం ఉందన్నారు.

ఇప్పుడు కూడా జేఎన్‌జే హౌసింగ్‌ సొసైటీకి కేటాయించిన 70 ఎకరాల స్థలం విషయంలో కూడా ఆ ఘనత గతంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానిదే అని ఆయన వ్యాఖ్యానించారు.

గత 16 సంవత్సరాల క్రితమే  జేఎన్‌జే మ్యాక్ హౌసింగ సొసైటీ జర్నలిస్టులు నిజాంపేట, పేట్‌బషీరాబాద్‌లలో ఈ భూములను కొనుగోలు చేసినప్పటికీ, కోర్టు కేసుల కారణంగా బాగా ఆలస్యమైందని మల్లు రవి తెలిపారు.

అయితే గత ఏడాది సుప్రీంకోర్టు జేఎన్‌జే జర్నలిస్టులకు అనుకూలంగా తుది తీర్పు వెలువరించినప్పటికీ ప్రభుత్వం నేటికీ ఆ స్థలాలను ఆ సొసైటీకి స్వాధీనం చేయకపోవడంపై తీవ్ర ఆ‍గ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం.. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకపోవడం ఒక తప్పిదమైతే, ఈ తీర్పు అమలు విషయంలో సొసైటీ నాయకత్వం ‘కంటెంప్ట్‌ ఆఫ్ ది కోర్ట్’ కేసు వేయకుండా నిర్లక్ష్యం చేయడం కూడా న్యాయపరంగా తప్పిదమే అవుతుందని మల్లురవి స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్య దేశంలో సుప్రీంకోర్టు తీర్పు కూడా చట్టంతో సమానమేనని, దానిని సంబంధిత పాలకులు కచ్చితంగా అమలు చేసి తీరాల్సిందేనన్నారు.

లేని పక్షంలో ప్రజాస్వామ్య వ్యవస్థ అభాసుపాలవుతుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధిగా వచ్చి తాను చెపుతున్న మాటలన్నీ తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకేనని ఆయన వివరించారు.

జర్నలిస్టుల జాగాలే లాక్కుంటారా?: ఈటెల రాజేందర్‌

నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన జర్నలిస్టులు.. నేడు తాము డబ్బులు వెచ్చించి కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాల కోసం రోడెక్కి ధర్నాలు చేయడం దురదృష్టకరమని బీజేపీ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్‌, ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ వ్యాఖ్యానించారు.

టీమ్ జేఎన్‌జే చేపట్టిన మహాధర్నా కార్యక్రమానికి విచ్చేసి మద్దతు తెలిపిన ఆయన మాట్లడుతూ.. 2008లో ఒక్కో సభ్యుడు రూ.2 లక్షల పెట్టి కొన్న స్థలాలను వారికి అప్పగించకుండా ప్రభుత్వం ఎందుకు తొక్కి పెడుతోందని ప్రశ్నించారు.

అప్పు, సప్పు చేసి అప్పట్లో సొసైటీ సభ్యులు రూ.12.33 కోట్లు ప్రభుత్వానికి చెల్లించి కొనుగొలు చేసిన భూములను అప్పనంగా లాక్కోవాలని ‍ప్రభుత్వం చూడడం వారి నీచ బుద్ధికి నిదర్శనమన్నారు.

కార్పొరేట్‌ సంస్థలకు, బీఆర్ఎస్ పైరవీదారులకు లీజుల పేరుతో ఒక్క రూపాయికే లక్షల కోట్ల విలువైన భూములను అప్పనంగా కట్టబెట్టడుతోందంటూ ప్రభుత్వం దుర్నీతిని ఆయన తూర్పారబట్టారు.

ఇటీవల అధికార పార్టీకి చెందిన రాజకీయ రీసెర్చ్ సెంటర్‌ కోసం కోకాపేటలో 11 ఎకరాల భూమిని కారు చౌకగా కొనుగోలు చేయడం దారుణమన్నారు.

అక్కడ ఎకరం భూమి మార్కెట్‌ విలువ రూ.40 కోట్లు వుండగా, బీఆర్‌ఎస్‌ పార్టీ కోసం అడ్డికి పావు శేరు లెక్కన నామ మాత్రపు ధరకు కొనుగోలు చేయడం సిగ్గుచేటు అని ఈటెల వ్యాఖ్యానించారు.

సుప్రీంకోర్టు తుది తీర్పు ప్రకారం జేఎన్‌జే హౌసింగ్ సొసైటీ జర్నలిస్టులకు భూములను అప్పగించే వరకు భారతీయ జనతాపార్టీ  వారికి అండగా నిలుస్తుందన్నారు. ఇక నుంచి జర్నలిస్టుల స్థలాల సాధనలో లాభీయింగ్‌లు పనిచేయవని… ఇక బరి గీసి కొట్లాడుడేనని ఆయన పిలుపునిచ్చారు.

జర్నలిస్టులకు ఎందుకివ్వరు?: వి.హన్మంతరావు

రాష్ట్రంలో వివిధ సంఘాలకు ఉచితంగా స్థలాలు ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం సమాజంలో గౌరవ ప్రదమైన వృత్తిలో కొనసాగుతోన్న జర్నలిస్టులకు డబ్బులు పెట్టి మరీ కొనుకున్న స్థలాలును ఎందుకివ్వడంలేదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు వి.హనుమంతురావు ప్రశ్నించారు.

న్యాయమైన జర్నలిస్టుల కోరిక తీరే వరకు వారి వెన్నంటి వుంటామని ఆయన స్పష్టం చేశారు. మరో ఆరు నెలల్లో రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌ అవుతుందని, ఆ తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమేనని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తామే జర్నలిస్టులకు ఆ స్థలాలను స్వాధీనం చేస్తామని చెప్పారు.

దానం చేస్తున్నారా?: మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌ రావు

జేఎన్‌జే మ్యాక్ హౌసింగ్ సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలను ఏమైనా దానమిస్తోందా అని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ న్యాయవాది ఎన్.రాంచందర్ రావు ప్రశ్నించారు. సొసైటీ సభ్యులు ఒక్కకొ్కరు నాడు రెండు లక్షల రూపాయలు పెట్టి ఆ భూములను కొనుక్కున్నారని తెలిపారు.

తాము కొనుగోలు చేసిన భూములను జర్నలిస్టులు దక్కించుకునేంత వరకు తాము అండగా నిలబడతామని స్పష్టం చేశారు. ఈ విషయంలో టీమ్ జేఎన్‌జే సభ్యులకు న్యాయపరంగా అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు తమ పార్టీ తరపున అందిస్తామని తెలిపారు.

ఎప్పటికైనా ఆ స్థలాలు జేఎన్‌జే జర్నలిస్టులవేనని, న్యాయం కోసం ఏళ్ల తరబడి పోరాడుతున్న జర్నలిస్టులకు తమ పార్టీ పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నట్లు ఆయన మరోసారి స్పష్టం చేశారు.

పోరాటం సహేతుకమే: సిపిఎం

జేఎన్‌జే సభ్యులు చేస్తున్న పోరాటం సహేతుకమైనదేనని సిపిఎం రాష్త్ర కార్యదర్సి వర్గ సభ్యుడు డి.జి.నరసింహారావు అన్నారు. డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన భూమిని జర్నలిస్టులకు రాష్త్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంలో గల ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. న్యాయసమ్మతమైన మీ పోరాటానికి మా మద్దతు వుంటుందన్నారు.

అధికార పార్టీతో పొత్తులో ఉన్నా … మద్దతిస్తాం: సిపిఐ

అధికార బిఆర్‌ఎస్‌ పార్టీతో తమకు పొత్తు వున్నప్పటికీ జర్నలిస్టుల న్యాయమైన పోరాటానికి తమ పూర్తి మద్దతు వుంటుందని సిపిఐ పార్టీ రాష్త్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఒక సమగ్రచట్టం తీసుకురావడానికి ప్రభుత్వాలు ముందుకురావాలన్నారు.

బిజెపి మహళామోర్చా అధ్యక్షురాలు గీతా మూర్తి మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

సమాజంలో ప్రజలందరి సమస్యలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులే సమస్యలో ఇరుక్కోవడం, దానికి రాజకీయ పార్టీల మద్దతు ఇవ్వడం పాలకుల నిర్భందానికి నిదర్శనమని అన్నారు. జర్నలిస్టుల స్థలాల సాధనలో బిజెపి ఎల్లవేళలా అండగా వుంటుందన్నారు.

జర్నలిస్టుల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీశారు: ఇందిరా శోభన్

తెలంగాణ ఉద్యమ పోరాటానికి పూర్తి స్థాయిలో మద్దతునిచ్చిన జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా రాష్త్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని, తమ ఇళ్ళ స్థలాల కోసం జర్నలిస్టులు ధర్నా చేయాల్సి రావడం ఇందుకు నిదర్శనమని తెలంగాణ ఆత్మగౌరవ వేదిక కన్వీనర్‌ ఇందిరా శోభన్‌ వ్యాఖ్యానించారు.

పాలకులకు నిజంగా జర్నలిస్టులపై ప్రేమ ఉంటే.. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వెలువరించిన తుది తీర్పు మేరకు తక్షణమే జేఎన్‌జే సొసైటీ సభ్యులు కొనుగోలు చేసిన భూమిని వారికి స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు.

వారికేమీ ఉచితంగా ఇవ్వడం లేదని, డబ్బు పెట్టి కొన్న భూమిని మీది కాదని చెప్పే ధైర్యం ప్రభుత్వం చేయలేదని ఇందిరా శోభన్ వ్యాఖ్యానించారు.

టీమ్ జేఎన్‌జే చేపట్టిన మహాధర్నా కార్యక్రమానికి విచ్చేసిన ప్రగతిశీల మహిళా సంఘం(పీడబ్ల్యూవో) అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ.. పేట్‌బషీరాబాద్‌‌లో ఆనాటి వైఎస్ సర్కారు కేటాయించిన 38 ఎకరాల స్థలాన్ని వెంటనే జేఎన్‌జే సొసైటీకి కేసీఆర్ ప్రభుత్వం అప్పగించాలని డిమాండ్ చేశారు.

జేఎన్‌జే హౌసింగ్ సొసైటీ సభ్యులు దాదాపు 63 మంది చనిపోయినా ప్రభుత్వం లెక్కచేయకపోవడం, నేటికీ సొసైటీ సభ్యులు కొనుగోలు చేసిన భూములను వారికి స్వాధీనం చేయకపోవడాన్నిఅరుణోదయ విమలక్క తీవ్రంగా తప్పుబట్టారు.

ఈ మహాధర్నాలో జర్నలిస్టు సంఘాల నాయకులు విరాహత్ ఆలీ,  కప్పర ప్రసాదరావు, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు రాములు గౌడ్‌, టీమ్ జేఎన్‌జే సభ్యులు బోడపాటి శ్రీనివాసరావు, హసన్‌ షరీఫ్‌, కొండం ఆశోక్‌ రెడ్డి, బి నాగభూషణరావు, బి.శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మణ్‌, రమేష్‌ రెడ్డి, తాతా శ్రీనివాస్, నర్సింగ్‌రాజ్‌, శ్రీచంద్ర, శ్యామ్‌సుందర్‌ రెడ్డి, చిత్ర, పిల్లి శ్రీనివాసరావు, వాసు, మంజుల, భవాని తదితరులు పాల్గొని జర్నలిస్టుల మహా ధర్నాకు పూర్తి మద్దతును ప్రకటించారు.

పెద్ద ఎత్తున జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఈ మహాధర్నాకు తరలివచ్చి.. జోరు వానను సైతం లెక్కచేయకుండా  ధర్నాలో కూర్చొని.. విజయవంతం చేశారు.

- Advertisement -