హైదరాబాద్: సినీ నటులు జీవిత, రాజశేఖర్‌కు మంగళవారం నాంపల్లిలోని 17వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు షాక్ ఇచ్చింది. ఓ పరువునష్టం కేసులో వారిని దోషులుగా తేలుస్తూ ఏడాది జైలుశిక్షతోపాటు రూ.5 వేల జరిమానా విధించింది.
హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంకు గురించి 2011లో ఓ ప్రెస్‌మీట్‌లో జీవిత, రాజశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ బ్లడ్ బ్యాంకు దాతల నుంచి ఉచితంగా రక్తాన్ని సేకరించి మార్కెట్లో అమ్ముకుంటోందంటూ అప్పట్లో వారు చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టించాయి.
ఈ ఆరోపణలపై నిర్మాత అల్లు అరవింద్ అప్పట్లోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించి.. జీవిత, రాజశేఖర్‌పై పరువు నష్టం దావా వేశారు. చిరంజీవి పేరిట కొనసాగుతోన్న రక్తనిధి, ఇతర సేవా కార్యక్రమాల గురించి వారు అసత్య ఆరోపణలు చేశారంటూ ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ కేసులో దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం నాంపల్లి 17వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు తాజాగా తీర్పును వెల్లడించింది. జీవిత, రాజశేఖర్‌ను దోషులుగా పేర్కొంటూ వారికి ఏడాది జైలుశిక్షతోపాటు రూ.5 వేల జరిమానా విధించింది.
తీర్పు వెలువడిన వెంటనే జీవిత, రాజశేఖర్ దంపతులు న్యాయస్థానం విధించిన జరిమానాను చెల్లించడంతో.. ఈ కేసులో పై కోర్టుకు అప్పీలు చేసుకునేందుకు వారికి అవకాశం కల్పిస్తూ.. వారిద్దరికీ అప్పటికప్పుడే కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది.