దేవుడూ.. ఇదంతా నీకు తెలిసే జరుగుతోందా?!

- Advertisement -
మాధవ్ సింగరాజు

కేసీఆర్‌ తన ప్రాణాల మీదకు తెచ్చుకుంటేనే గానీ ప్రత్యేక తెలంగాణ రాలేదు. 1000 మందికి పైగా హైద్రాబాద్‌ జర్నలిస్టులు 15 ఏళ్లుగా పోరాడుతున్నా కూడా – వారిలో ఒక్కొక్కరుగా 60 మందికి పైగా రాలిపోయారు తప్ప – నేటికీ ఇళ్ల స్థలాలు రాలేదు. డబ్బు కట్టారు. దగా పడ్డారు.

వీళ్లంతా నిన్న మొన్నటి జర్నలిస్టులు కారు. సీనియర్‌లు, సీనియర్‌ మోస్ట్‌లు. దాదాపుగా అందరూ తమ పిల్లలకు పెళ్లి చేయవలసిన వయసుకు చేరుకున్న వారే.

ఎదిగొచ్చిన పిల్లల కాయకష్టంతో, వారి అరచేతుల రక్షణలో – రేపో మాపో తమ స్థలం తమకు వస్తుందని, కేసీఆర్‌ అన్యాయం చేయడనీ – ఆశగా రెపరెపలాడుతున్న దీపాలే!

కేసీఆర్‌ కేంద్రానికి డబ్బు కట్టి ఏమీ 1,12,000 చదరపు కి.మీ. తెలంగాణ ల్యాండ్‌ ను కొనుక్కోలేదు. హక్కుగా కొట్లాడి గుంజుకున్నారు. మరి హైదరాబాద్‌ జర్నలిస్టులు తినీ తినక తమ కష్టార్జితం లోంచి కూడబెట్టుకున్న డబ్బుతో ప్రభుత్వం దగ్గర్నుంచి కొనుకున్న స్థలంపై వారికి ఇంకెంత హక్కుండాలి?! .

ఈరోజు చెబుతున్నా కదా.. కేసీఆర్‌ నాకు దేవుడు. ఇన్నాళ్లు ఈ ఆంధ్రోడు బయట పడలా. ఇప్పుడు పడుతున్నడు. కేసీఆర్‌ నాకు దేవుడు. ఈ గాలిని పీల్చనిస్తున్నడు. ఈ నీటిని తాగనిస్తున్నడు. ఈ రోడ్లపై నడవనిస్తున్నడు. ఇన్ని చేస్తున్నడు.. ఇక్కడ ఉంటనంటే వద్దంటడా? నా మాట కూడా మారబట్టె. కేసీఆర్‌ ఉండమంటే హైద్రాబాద్‌ పొమ్మంటదా! అనదు. ఆయన కొడుకు కేటీఆర్‌ ఒక్క సంతకం పెడితే స్థలం రాకుంటదా! వస్తది.

పద్నాలుగేళ్లు జర్నలిస్టులు పోరాడితే.. ‘‘మీరు కొనుక్కున్న స్థలం మీదే’’ అని సుప్రీంకోర్టు అనింది. అని 11 నెలలు అయింది. కేటీఆర్‌ సంతకం పెట్టుడు ఒక్కటే మిగిలింది. మినిస్టర్‌ ఆయన. సంతకం పెట్టవలసింది ఆయనే. పెట్టడం లేదు!

ఒక్క సంతకం.. కేటీఆర్‌ ఒక్క సంతకం పెడితే.. వెయ్యిమంది జర్నలిస్టుల కుటుంబాలు స్విచ్‌ వేసినట్లుగా ఒక్కసారిగా వెలుగుతాయి.

వేల వడ్డీలకు అప్పులు చేసి, తాళిబొట్లు తాకట్టు పెట్టి తెచ్చి, ఇంటి స్థలం కోసం డబ్బు కట్టిన జర్నలిస్టుల ఊపిరి కాస్త నిలుస్తుంది. వీధుల్లో పట్టుకుని వడ్డీల కోసం ఒత్తిడి చేసేవాళ్లు కాస్త వెనక్కు తగ్గుతారు.

ఇంటి పెద్దకు కూడా.. ‘నేను పోతేనేం? నా భార్యా బిడ్డలకు అండగా నా అంతటి ఇల్లుంది కదా..’ అనే ధైర్యం ఉంటుంది.కానీ కేటీఆర్‌ ‘స్థలం స్వాధీనం’ పత్రాలపై సంతకం పెట్టడం లేదు.

ఎందుకు సంతకం పెట్టడం లేదు?
ఈ ప్రశ్నకు జవాబుగా రకరకాల మాటలు వినిపిస్తున్నాయి.

‘‘మీకు స్థలాలు ఇచ్చి, మీ తర్వాతి జర్నలిస్టులకు ఇవ్వకపోతే ఎలా?’ అని కేటీఆర్‌ అన్నారనీ…! అందరికీ కలిపి ఒకేసారి ఇస్తామని కేటీఆర్‌ అంటున్నారనీ..!

నిజమే. ప్రభువులకు ఆ మాత్రం బాధ్యత ఉంటుంది. అందర్నీ చల్లగా చూడాల్సిందే. అయితే ఇవాళ కడుపు చేతపట్టుకుని, నిస్సత్తువగా కళ్లు తిరిగి పడిపోయేలా ఉన్నవారిని చల్లగా చూడ్డానికి.. రేపు కడుపు చేతపట్టుకుని రాబోయే వారి కోసం ఎదురు చూడటం ఏమిటి? వాళ్లు వచ్చే వరకు ఆగి, వాళ్లను వీళ్లను కలిపి ఒకేసారి అందర్నీ చల్లగా చూస్తానని అనడం ఏమిటి!!

స్థలం కోసం లక్షల డబ్బులు కట్టినవాళ్లు.. వీళ్లు. డబ్బులు కట్టి కూడా పద్నాలుగేళ్లు కోర్టులో పోరాడవలసి వచ్చిన దురదృష్టవంతులు.. వీళ్లు.

‘డబ్బులు కట్టారు కనుక మీ స్థలాలకు మీరే హక్కు దారులు’ అని ఏడాది క్రితమే కోర్టు ఆర్డర్‌ పొందిన వాళ్లు.. వీళ్లు. ఇంటి మీద పడి వడ్డీ డబ్బులు అడుగుతున్న వారితో రోజూ మాటలు పడుతున్న వాళ్లు.. వీళ్లు.

పిల్లల పెళ్లిళ్ల కోసం, పిల్లల చదువుల కోసం నానా గడ్డీ కరుస్తున్నది.. వీళ్లు. 50లు, 60లు, 70ల వయసుల్లో ఉన్న వాళ్లు.. వీళ్లు.

వృద్ధాప్యపు అనారోగ్యాలతో, హార్ట్‌ ఎటాక్‌లతో, బ్రెయిన్‌ స్ట్రోక్‌లతో మూల పడుతున్న వాళ్లు.. వీళ్లు.

వీళ్లతో.. రాబోయే వాళ్లకు సంబంధం ఏమిటి?
వీళ్లకూ, ఆ వచ్చేవాళ్లకు కలిపి ఒకేసారి స్థలాలను ఇస్తామనడం ఏమిటి?

ఎదురుగా కంచంలో ఉన్న వీళ్ల తిండిని వీళ్లను తిననివ్వకుండా.. నెక్స్‌ట్‌ జనరేషన్‌ వాళ్లు కూడా వచ్చాక అందరికి సహపంక్తిలో వడ్డిస్తానని అనడం ఏమిటి?!

‘‘మా తెలంగాణను మాకు ఇవ్వండి’’ అని కేసీఆర్‌ అడుగుతున్నప్పుడు… ‘కాస్త ఆగండి కేసీఆర్‌.. దేశంలో ఇంకా ఎవరెవరు భవిష్యత్తులో ప్రత్యేక రాష్ట్రాలు కోరుకోబోతారో వారందరితో కలిపి ఒకేసారి మీక్కూడా ప్రత్యేక తెలంగాణ ఇస్తాం..’’ అని కేంద్రం అని ఉంటే.. కేసీఆర్‌ ఎలా రియాక్ట్‌ అయ్యేవారో ఆయన కొడుకు కేటీఆర్‌ను జర్నలిస్టులు అడిగితే ఏం సమాధానం చెబుతారు?!

అలా అడగలేని జర్నలిస్టులం అయ్యామా?
అసలు జర్నలిస్టులమే కాకుండా పోయామా?

ఆ రెండు టమాటా బుట్టలు మనవి.
ఆ టామాటా బుట్టల్ని కొన్నప్పుడు వాటి ఖరీదు పావలానే కావచ్చు. ఇప్పుడు వాటి ధర రూపాయి పావలాకు పెరిగి ఉండొచ్చు.
అయితే మాత్రం?!
‘‘అమ్మో! అంత ఖరీదైన టమాటాల్ని జర్నలిస్టులకు ఇచ్చేయడమా?’’ అని కేటీఆర్‌ అనడం న్యాయమేనా?

‘‘టమాటాల కోసం ఇంకా కొంతమంది వస్తారు కదా. వాళ్లకు మీకూ కలిపి ఒకేసారి టమాటాలను ఇచ్చేస్తాం’’ అని కేటీఆర్‌ అనడం న్యాయమేనా?

‘‘సిటీలో టామాటాలకు బాగా డిమాండ్‌ ఉంది కనుక మీ రెండు బుట్టల్లోని టమాటాల నుంచే మీకు, రాబోయే తరాల జర్నలిస్టులకు కలిపి మాంచి టమాటా కర్రీని వండి తలా రెండు గరిటెల్ని వడ్డిస్తాం’’ అని కేటీఆర్‌ అనడం న్యాయమేనా?

అసలు కేటీఆర్‌ ఎందుకు మన స్థలాలను మనకు స్వాధీనం చేస్తూ సంతకం పెట్టడం లేదు?
ఈ ప్రశ్నకు జవాబుగా ఇంకో మాట కూడా వినిపిస్తోంది.

స్థలాలు వచ్చిన వెయ్యిమంది జర్నలిస్టులలో ఆంధ్రోళ్లే ఎక్కువమంది ఉన్నారని కొందరు తెలంగాణ జర్నలిస్టులు ఆయన దృష్టికి తీసుకెళ్లి ఆయన్ని టమాటా కర్రీ తయారీకి ఇన్‌ఫ్లుయెన్స్‌ చేస్తున్నారని!!!

‘‘తెలంగాణలో ఆంధ్రావాళ్లు కూడా ఉన్నారు కదా. ప్రత్యేక తెలంగాణ ఎలా ఇస్తాం?’’ అని ఆనాడు కేంద్రం అడిగి ఉంటే కేసీఆర్‌ ఎలా రియాక్ట్‌ అయ్యేవారో ఆయన కొడుకు కేటీఆర్‌ను జర్నలిస్టులు అడిగితే ఏం సమాధానం చెబుతారు?!

అలా అడగలేని జర్నలిస్టులం అయ్యామా?
అసలు జర్నలిస్టులమే కాకుండా పోయామా?

2009లో తెలంగాణ ఉద్యమం హింసాత్మకం కాబోతున్నప్పుడు ఒక రాత్రి రామంతాపూర్‌లో ఉద్యమకారులు విసిరిన రాళ్ల దెబ్బలు తిన్న ఆంధ్రోళ్లలో ఈ ఆంధ్రోడు కూడా ఉన్నాడు.

2011 మిలియన్‌ మార్చ్‌లో ట్యాంక్‌బండ్‌కు చేరుకున్న ఉద్యమకారులతో కలిసి ఈ ఆంధ్రోడు కూడా ప్రత్యేక తెలంగాణ కోసం నినాదాలిచ్చాడు.

18 జూలై 2023న ఇందిరా పార్క్‌ దగ్గర జరిగిన జర్నలిస్టుల మహాధర్నాలో ఈటల రాజేందరన్న.. ‘‘కోట్లాడితే కానీ కేసీఆర్‌ ఇవ్వడు’’ అన్నారు.
కొట్లాడి తెలంగాణ ను తెచ్చినవాడు కనుక, కొట్లాడితేనే మీ స్థలాలను హ్యాండోవర్‌ చేయిస్తాడు అని కావచ్చు.

అయితే..
కేసీఆర్‌ నాకు దేవుడు. నేనైతే గుంపులో నిలబడైనా ఆయనకు వ్యతిరేకంగా ఒక్క నినాదం కూడా ఇవ్వలేను. ఈ గాలిని పీల్చనిస్తున్నడు. ఈ నీటిని తాగనిస్తున్నడు. ఈ రోడ్లపై నడవనిస్తున్నడు. ఇన్ని చేస్తున్నడు.. ఇక్కడ ఉంటనంటే వద్దంటడా? కేసీఆర్‌ ఉండమంటే హైద్రాబాద్‌ పొమ్మంటదా! కేటీఆర్‌ పొమ్మంటడా!

నేను అనుకోవడం ఇంత జరుగుతున్నట్లు కేసీఆర్‌కి తెలియదేమోనని!
తెలిస్తే – ‘‘ఏందీ గోస, వాళ్లది వాళ్లకు ఇచ్చెడిదుండె..’’ అనకపోతరా?!

– రచయిత ఫేస్‌బుక్ వాల్ సౌజన్యంతో…

- Advertisement -