ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత ‘గేమ్ ప్లాన్’… ఈడీ అరెస్ట్‌ను తప్పించుకునేందుకేనా?

- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కీలకపాత్ర పోషించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం కేసీఆర్‌ తనయ, ఎమెల్సీ కల్వకుంట్ల కవిత… ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) గురువారం నాటి విచారణకు ‘డుమ్మా’ కొట్టారు.

అప్పటివరకు ఈడీ విచారణకు వెళతారన్న సంకేతాలే ఉన్నా, చివరి నిమిషంలో కవిత మనసు మార్చుకున్నారు. న్యాయ నిపుణులతో చర్చల తర్వాత ఈడీ విచారణకు వెళ్లకూడదని నిర్ణయించారు. దీనికి ఆమె అనారోగ్యం అనే సాకును చూపారు.

దీంతో ఈడీ తనను కచ్చితంగా అరెస్టు చేస్తుందని కవిత భావించారని, ఆ అరెస్ట్ తప్పించుకోవడానికే కవిత డుమ్మా కొట్టారు అన్న ప్రచారం సాగుతోంది.

అరెస్ట్ తప్పించుకునేందుకేనా?

ఈ కేసులో మార్చి 11వ తేదీన ఈడీ అధికారులు 9 గంటల పాటు కవితను ప్రశ్నించారు. 16వ తేదీన మరోసారి విచారణకు హాజరుకావాలని కవితకు స్పష్టం చేశారు.

16న అడిటర్‌ బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్లై, ఢిల్లీ మాజీ డిఫ్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాలతో కలిపి కల్వకుంట్ల కవితను విచారించాలని ఈడీ భావించింది.

ఒకరు చెప్పిన సాక్ష్యాలను మరొకతో దృవీకరింపజేసుకోవాలని, తద్వారా కవిత ప్రమేయంపై తగిన ఆధారాలను సంపాదించాలని ఈడీ అధికారులు ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కవిత రెండోసారి విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది.

బుక్ చేసేందుకు ప్లాన్?

వేళ కవిత విచారణకు సహకరించకపోతే ఈ దఫా ఆమెను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని బీఆర్‌ఎస్‌ వర్గాలు అనుమానించాయి.

మరోవైపు మనీష్ సిసోడియా కస్టడీ ఈనెల 17న, అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీ నేటితో ముగుస్తున్నందున లిక్కర్‌ స్కాంలో కవిత పాత్రను తేల్చేందుకు ఈడీ ప్రయత్నించవచ్చని సమాచారం.

ఈ పరిణామాలను ఊహించినందు వల్లే కవితా…నిన్న సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈడీ విచారణను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

అయితే పిటిషన్ ను వెంటనే విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించకపోవడం, స్టే కు నిరాకరించడంతో కవిత ప్రయత్నాలకు విఘాతం కలిగినట్లయింది.

దీంతో ఈ విషయం చాలా సీరియస్ గా మారే అవకాశం ఉందని, కవిత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న అభిప్రాయాలు వినవచ్చాయి.

ఢిల్లీకి మంత్రుల క్యూ..

కాగా, గతవారం మహిళా రిజర్వేషన్ పేరుతో ధర్నా నిర్వహించి పార్టీ కార్యకర్తలను సమీకరించిన కవిత ఈసారి కూడా అదే విధానాన్ని అనుసరించారు.

ఢిల్లీలోని మెరీడియన్ హోటల్లో మహిళా రిజర్వేషన్ పై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి నేతల సంఘీభావం పొందే ప్రయత్నం చేశారు.

మరోవైపు కవితకు మద్దతుగా కేటీఆర్, హరీష్ రావుతో పాటు కేసీఆర్‌ క్యాబినెట్‌ లోని సగం మంది మంత్రులు ఢిల్లీలో వాలిపోయి ఇక్కడి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఒకవేళ కవితను అరెస్టు చేస్తే వెంటనే రాజకీయ కార్యాచరణకు వారు సన్నద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది.

అరెస్ట్ తప్పదా?

అనారోగ్య కారణాలతో విచారణకు రావడం లేదని కవిత పంపిన మెసెజ్‌ ను ఈడీ త్రోసిపుచ్చింది. విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది.

అయితే కవితను మరోసారి గడువు ఇచ్చి విచారణకు పిలుస్తారా? లేక విచారణకు సహకరించడం లేదని ఈ రోజే అరెస్ట్‌ చేస్తారా? అన్నది బీఆర్‌ఎస్‌ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

- Advertisement -