Rain Alert: మరో మూడు రోజులు.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు!

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ వర్షాలు కురియనున్నట్లు పేర్కొంది.

హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని.. రంగారెడ్డి, సంగారెడ్డి, ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు ఆ శాఖ అధికారులు తెలియజేశారు.

అలాగే సిద్దిపేట, జనగాం, పెద్దపల్లి, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వారు పేర్కొన్నారు.

భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ చేయడంతో.. తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి విపత్తు నివారణ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, కామారెడ్డి, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో జన జీవనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆమె ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచించారు.

మంగళవారం రాత్రి ఆయా జిల్లాల అధికారులతో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆయా కలెక్టరేట్ కేంద్రాలు, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

అత్యధిక వర్షపాతం…

మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మంగళవారం ఉదయం నుంచే వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ములుగు జిల్లాలోని వెంకటాపూర్, తాడ్వాయి, ఏటూరునాగారం, గోవిందరావుపేట, వెంకటాపురం ప్రాంతాల్లో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.

ములుగు జిల్లా పేరూరు, హన్మకొండ జిల్లా పరకాలలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా.. రేగొండ, ఎల్లారెడ్డిపేట, గంగాధర, ఆత్మకూరు, భీంగల్, చొప్పదండి, చందుర్తి, ములుగు, హుజూరాబాద్, చిట్యాల, శాయంపేట ప్రాంతాల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

భాగ్యనగరం.. జర భద్రం!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా వచ్చే మూడు రోజులు గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కూడా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

అల్పపీడనం నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచే నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం అయింది. గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు మొదలయ్యాయి.

మంత్రి కేటీఆర్ సమీక్ష!

మరోవైపు మంత్రి కేటీఆర్ కూడా పురపాలక శాఖ ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

జలమండలి, పోలీసు శాఖ, విద్యుత్, రెవెన్యూ యాంత్రాంగం, ట్రాఫిక్ పోలీసులు తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

- Advertisement -