కశ్మీర్‌ టూ కన్యాకుమారి… హైదరాబాదీ సోలో సైకిల్‌ యాత్ర

- Advertisement -

హైదరాబాద్‌ : హైదరాబాద్ కు చెందిన బొబ్బా రవీందర్ రెడ్డి… భారత్ సోలో పేరిట ఒక్కడే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. యువతలో బద్ధకాన్ని తొలగించేందుకు, వారిలో చైతన్యం నింపే ఉద్దేశ్యంతో ఒంటరిగా సైకిల్ యాత్ర చేస్తున్నారు. శ్రీనగర్‌ లోని చారిత్రక లాల్ చౌక్ వద్ద ప్రారంభమైన భారత్ సోలో యాత్ర పలు రాష్ట్రాలను దాటుకుంటూ హైదరాబాద్ చేరుకున్నారు.

పరుగుల యంత్రం..

గేయిల్ సంస్థలో మార్కెటింగ్‌ మేనేజర్ అయిన బొబ్బా రవీందర్ రెడ్డి… సైక్లింగ్‌, స్విమ్మింగ్‌, పరుగులో పలు రికార్డులు నెలకొల్పారు. 42 ఏళ్ల వయస్సులో మొదటి మారథాన్ ను పూర్తి చేసిన రవీందర్ రెడ్డి…ఈ ఎనిమిదేళ్లలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన 268 మారథాన్ లలో పాల్గొన్నారు.

ఇందులో 250 హాఫ్ మారథాన్ లు, 14 ఫుల్ మారథాన్ లు, నాలుగు అల్ట్రా మారథాన్స్, మూడు ట్రయథ్లాన్ లు ఉన్నాయి. ఒకే నెలలో 33 హాఫ్ మారథాన్ లు పూర్తి చేసి అప్పటి వరకు ఉన్న 32 హాఫ్ మారథాన్స్ రికార్డును బద్దలు కొట్టి తన పేరిట లిఖించారు. ఈ ఘనత గత ఏడాది అక్టోబర్ 30న అందుకున్నారు.

అలాగే పలు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ప్రపంచ రికార్డులు నెలకొల్పారు. ట్రయథ్లాన్ లోనూ అరుదైన రికార్డు నెలకొల్పారు. కేవలం 17 గంటల్లోనే వెంటవెంటనే 3.9 కిలోమీటర్ల స్విమ్మింగ్‌, 180 కిలోమీటర్ల సైక్లింగ్, 42 కిలోమీటర్ల పరుగును పూర్తి చేసి ఆశ్చర్యపరిచారు.

చైతన్యం నింపేందుకే…

గతంలో గ్రూప్ తో కలిసి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైక్లింగ్ చేశానని, దేశం అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఒంటరిగానే భారత్ సోలో సైక్లింగ్ యాత్ర చేపట్టినట్లు బొబ్బా రవీందర్ రెడ్డి వివరించారు.

నేటి యువత సెల్ ఫోన్లుకు అతుక్కుపోయి, తమ ఆరోగ్యంపై శ్రద్ధ లేకుండా అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారని, వారిలో చైతన్యం నింపడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

- Advertisement -