ఈ కలియుగం తర్వాత.. మళ్లీ కృత, త్రేతా, ద్వాపర యుగాలు మొదలవుతాయా?

- Advertisement -

ప్రస్తుతం మనం ‘కలియుగం’లో ఉన్నామనే విషయం అందరికీ తెలిసిందే. దీనికి ముందు క‌ృత యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం ఉండేవని, ఈ యుగాలన్నీ అంతం అయిన తరువాతే కలియుగం మొదలైందని చెబుతారు.

అయితే కొందరు మరొక అడుగు ముందుకేసి.. ఈ కలియుగం తర్వాత మళ్లీ కృత యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగాలు మొదలవుతాయని.. అంతేకాదు, రామాయణం, మహాభారతం కూడా మళ్ళీ జరుగుతాయని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇంతకీ ఇది నిజమేనా? లేక అభూత కల్పనా?

అసలు ఈ యుగాలు ఏమిటి? వీటి కాల వ్యవధి ఎంత? ఈ యుగాలు మళ్లీ మళ్లీ మొదలవడం ఏమిటి? అంటే కాలానికి అంతం అనేది లేదా?

లెక్కకు అందని కాలమానం…?

విశ్వం, సృష్టి ఎంతో పురాతనమైనవని పాశ్చాత్యులు మొన్నమొన్నటి వరకు ఒప్పుకోనే లేదు. క్రైస్తవుల పరిశుద్ధ గ్రంథం బైబిలు ప్రకారం దేవుడు ఈ విశ్వాన్ని 5 వేల ఏళ్ల క్రితం సృష్టించాడు. క్రైస్తవుల దృష్టిలో దేవుడు మానవ స్వరూపుడు, మగ వాడు.

విశ్వమూ, సృష్టి ఆది మధ్యాంత రహితం అని పేర్కొంటాం. కాబట్టి ఆది మధ్యాంత రహితుడయిన సృష్టికర్తని మానవ కాలమానం ప్రకారమో, దైర్ఘ్య మానం ప్రకారమో కొలవలేం. అసలు ఆ సృష్టి ప్రక్రియలని వర్ణించాలంటే పెద్ద పెద్ద సంఖ్యలు కూడా సరిపోవు.

హైందవ కాలమానం ఇలా…

మన కాలమానం ప్రకారం కలియుగం ఒక్కటే 432,000 సంవత్సరాలు నడుస్తుంది. కలియుగం కంటే ద్వాపరయుగం రెండింతలు, త్రేతాయుగం మూడింతలు, కృతయుగం నాలుగింతలు. ఈ నాలుగు యుగాలనీ కలిపి ఒక మహాయుగం అంటారు.

అంటే ఒక మహాయుగం.. కలియుగం కంటే పదింతలు, లేదా 4,320,000 సంవత్సరాలు. ఆధునిక పరిభాషలో 4.32 మిలియను సంవత్సరాలు.

మనందరికీ ఈ రోజుల్లో ఐన్‌స్టీన్ సిద్ధాంతాలు కరతలామలకాలు అయిపోయాయి కాబట్టి, పైన పేర్కొన్న ‘సంవత్సరాలు’ మన భూలోకం లెక్క ప్రకారం అని మరచిపోకండి. కనుక వీటిని ‘మానవ సంవత్సరాలు’ అందాం.

‘సత్యలోకం’లో కాలమానం…

కాని సృష్టి జరిపే బ్రహ్మ ఎక్కడో ‘సత్యలోకం’లో ఉంటాడు. మళ్లీ అక్కడి సంవత్సరం పొడుగు వేరు. అక్కడ లెక్క ఇలా ఉంటుంది. సత్యలోకంలో పగటి పూటని ఒక కల్పం అనీ రాత్రి పూటని ఒక కల్పం అనీ అంటారు. ఒక పగలూ, ఒక రాత్రీ కలపగా వచ్చిన దినాన్ని ‘విశేష కల్పం’ అంటారు.

సత్యలోకంలో బ్రహ్మ ‘అక్కడి సూర్యోదయం’ వేళకి తన సృష్టి ప్రారంభిస్తాడు. సాయంత్రం అయేసరికి సృష్టి లయమై పోతుంది. దీనినే ప్రళయం అంటారు. రాత్రి బ్రహ్మకి విశ్రాంతి సమయం.

రాత్రి వేళప్పుడు మన మెదడు కలలు కంటూ ఎలా ‘విశ్రాంతి’ తీసుకుంటుందో అదే విధంగా బ్రహ్మ నిద్రపోతూన్నప్పుడు, మరుసటి రోజు సృష్టికి సంబంధించి ప్రయత్నాలు జరుగుతాయన్నమాట..

ఒక కల్పం పొడుగు 14 మన్వంతరాలు. ఒకొక్క మన్వంతరం 71 మహాయుగాల మీద కొంత చిల్లర. ఒక కల్పంలో 14X71 = 994 మహాయుగాలు. దీనికి పైన చెప్పిన చిల్లర కలిపితే 1 కల్పం = 1,000 మహాయుగాలు.

ఒకొక్క మహాయుగం 4.32 మిలియను సంవత్సరాలు కనుక 1 కల్పం = 1,000 X 4.32 మిలియను = 4.32 బిలియను మానవ సంవత్సరాలు. (ఒక బిలియను అంటే 1 తర్వాత 9 సున్నాలు అన్న విషయం తెలిసిందేకదా)

కనుక బ్రహ్మ పగలు 4.32 బిలియను, రాత్రి 4.32 బిలియను మానవ సంవత్సరాలు. లేదా సత్యలోకంలో ఒక దినం 8.64 బిలియను మానవ సంవత్సరాలు. ఇటువంటివి 360 దినాలు గడిస్తే అది ఒక సత్యలోకంలో ఒక సంవత్సరం.

అంటే సృష్టిని చేసే బ్రహ్మకి ఒక సంవత్సరం గడిచేసరికి మన భూలోకంలో 360 X 8.64 = 3.1104 ట్రిలియను సంవత్సరాలు. (ఒక ట్రిలియను అంటే 1 తర్వాత 12 సున్నాలు.)

ఇక బ్రహ్మ ఆయుర్దాయం 100 సత్య లోకపు సంవత్సరాలు, లేదా 311.04 ట్రిలియను సంవత్సరాలు. ఈ కాలాన్నే ‘పర’ అంటారు. ఇందులో సగం ‘పరార్ధం.’ అంటే బ్రహ్మకి ఏభై ఏళ్ళ వరకూ ఉన్న కాలం ప్రథమ పరార్ధం అన్న మాట.

మన బ్రహ్మ ప్రస్తుత వయస్సు 51 సత్యలోకపు సంవత్సరాలట.. అంటే మనం ఇప్పుడు ద్వితీయ పరార్ధంలో ఉన్నామన్న మాట. ఈ 51 వ సంవత్సరాన్ని శ్వేత వరాహ కల్పం అంటారు. మన భూలోకంలో సంవత్సరాలకు ప్రభవ, విభవ, లాంటి పేర్లు ఉన్నట్లే, సత్యలోకంలో ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుందన్న మాట.

ఈ శ్వేత వరాహ కల్పంలో ప్రస్తుతం నడుస్తూన్న మన్వంతరం పేరు వైవశ్వత మన్వంతరం. ఈ వైవశ్వత మన్వంతరంలోని 28వ మహాయుగంలోని ‘కలియుగం’లో ఉన్నాం.

‘కలియుగం’లో ప్రథమ పాదంలోనే…

ఈ కలియుగం శ్రీకృష్ణుడి నిర్యాణంతో 5,000 ఏళ్ళ క్రితం మొదలైంది. కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలు. అలా చూసుకుంటే ఇప్పటికి సుమారు 5100 సంవత్సరాలు గడిచాయంట. ఇంకా 4,26,900 సంవత్సరాలు మిగిలున్నాయి.

ప్రస్తుతం మనం కలియుగం ప్రథమ పాదంలో అంటే..  ప్రారంభంలోనే ఉన్నాం. ఈ ప్రథమ పాదంలోనే కలియుగం ఇలా ఉందంటే.. ఇక చతుర్ధ పాదం వచ్చేసరికి ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

( ఇంకా ఉంది…)
- Advertisement -