లండన్: 2011లో సచిన్ చిట్టచివరిగా ఇంగ్లాండ్ సిరీస్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే.
అప్పటికే సచిన్ 99 సెంచరీలు చేసి ఉండడంతో ఎలాగైనా వందో సెంచరీ పూర్తి చేస్తాడని అభిమానులంతా అనుకున్నారు.
కానీచివరి మ్యాచ్ వరకు అది సాధ్యం కాలేదు. ఓవల్ వేదికగా జరిగిన చివరి ఇన్నింగ్స్‌లో 91 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అంపైర్ తప్పుడు నిర్ణయానికి సచిన్ బలైపోయిడు.
దీంతో ఇంగ్లాండ్‌లో సచిన్ సెంచరీ చేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. అయితే సచిన్‌ను ఆ మ్యాచ్‌లో ఔట్ చేసిన బ్రెస్నన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా ఆ సంఘటనకు సంబంధించి సంచలన విషయాలను పంచుకున్నాడు.
సచిన్‌ను ఔట్ చేసినందుకుగానూ తనను చంపేస్తామని కొందరు బెదిరించినట్లు ఇంగ్లాండ్ పేసర్ టిమ్ బ్రెస్నన్ చెప్పాడు.
ఆ మ్యాచ్‌లో సచిన్ వందో సెంచరీ చేయాల్సిందని, అయితే 91 పరుగుల వద్ద తన బౌలింగ్‌లో ఎల్బీడబ్లూగా వెనుతిరగడంతో చేయలేకపోయాడని బ్రెస్నన్ పేర్కొన్నాడు.
‘ఆ సమయంలో సచిన్‌ను ఔట్ చేసినందుకు ట్విటర్లో నన్ను చాలా మంది చంపేస్తామని బెదిరించారు.
ఎల్బీడబ్ల్యూగా ప్రకటించినందుకు అంపైర్ రాడ్ టకర్‌ను కూడా చంపేస్తామని ఆయనకు ఏకంగా ఉత్తరాలు రాశారు.
కొన్ని రోజుల తర్వాత టకర్‌ను కలిసినప్పుడు ఆయనను దీనిపై ప్రశ్నించా.. దానికి ఆయన ఉత్తరాలు చూసిన తర్వాత ఓ సెక్యూరిటీ గార్డును కూడా పెట్టుకున్నానని వాపోయాడు’ అంటూ బ్రెస్నన్ చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే ఆ మ్యాచ్‌లో 91 పరుగుల వద్ద ఉన్న సచిన్ ప్యాడ్లకు బంతి తగిలినప్పటికీ అది లెగ్ వికెట్‌ను మిస్ చేస్తూ వెళ్లింది.
ఇది గమనించని అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. అయితే ఆ మ్యాచ్‌లో డీఆర్ఎస్ కూడా లేకపోవడంతో సచిన్ అంపైర్ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేసే అవకాశం లేకుండా పోయింది.
అంతేకాకుండా ఈ సిరీస్ సచిన్‌కు చిట్టచివరి ఇంగ్లాండ్ సిరీస్ కావడంతో అక్కడ ఎలాగైనా సెంచరీ సాధిస్తాడని అభిమానులంతా ఆశించారు. అయితే అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగా వారి ఆశ నిరాశగా మారింది.