Corona In India: దేశంలో విస్తరిస్తున్న ‘కరోనా’… పెరుగుతున్న కేసులు, మరణాలు

- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విస్తరణ కొనసాగుతూనే ఉంది. కొత్త కేసులు ఒక్కో రోజు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. మంగళవారం రోజున 14 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా తాజాగా గడిచిన 24 గంటల్లో మళ్లీ 18 వేలకుపైగా కేసులు నమోదు అయ్యాయి.

కొత్త కేసులు తగ్గాయిలే అనుకునేలోగానే మళ్లీ అంతకుమించి పెరగడం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో లక్షకుపైగానే కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి.

బుధవారం 4.52 లక్షల మందికి కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా – 18,819 మందికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు కూడా 4.16 శాతానికి చేరడం గమనార్హం. రోజువారీ కేసులు ఈ స్థాయిలో పెరగటం దాదాపు 130 రోజుల తరువాత ఇప్పుడేనని తెలుస్తోంది.

ఒక్క కేరళలోనే 4,459 పాజిటివ్ కేసులు నమోదుకాగా మహారాష్ట్రలో 3,957 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో కూడా వేయికిపైగానే కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు 24 గంటల వ్యవధిలో 13,827 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

పెరుగుతున్న మరణాలు…

ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు 1.04,555కి చేరుకున్నాయి. రోజువారీ కేసులు పెరగడమే కాదు మరణాలు కూడా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోన్న అంశం. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనాతో 39 మరణించారు. ఒక్క కేరళలోనే 17 మంది బలయ్యారు.

కరోనా కట్టడి కోసం గత ఏడాది ప్రారంభించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం కింద ఇప్పటి వరకు 197.61 కోట్ల మందికి టీకాలు వేశారు. బుధవారం ఒక్క రోజునే 1.17 లక్షల మంది వ్యాక్సిన్ డోసు వేయించుకున్నారు.

ఇవి కూడా చదవండి

China: లాక్‌డౌన్ ఆంక్షల దిగ్బంధనంలో చైనా నగరాలు.. షాంఘైలో ఒక్కరోజులో 51 మరణాలు…

 

- Advertisement -