చెన్నై: చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ మంగళవారం రాత్రి హఠాత్తుగా మరణించారు. కొంత కాలంగా పోస్ట్ కొవిడ్ సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.
మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణంతో ఆ కుటుంబంతోపాటు ఇటు చిత్రసీమలోనూ విషాదం అలముకుంది. ఈ వార్త తెలియగానే దక్షిణాది చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. పలువురు సంతాపం వ్యక్తం చేస్తూ మీనా కుటుంబానికి తమ సానుభూతిని తెలుపుతున్నారు.
అసలేం జరిగిందంటే…
మీనా భర్త విద్యాసాగర్ గత కొన్ని సంవత్సరాలుగా లంగ్స్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు గతంలో కోవిడ్ కూడా సోకింది. అప్పట్లో చికిత్స అనంతరం కరోనా నుంచి ఆయన కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తుల సమస్య మరింత తీవ్రమైంది.
ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు సూచించడంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. వైద్యులు కూడా లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీకి అవసరమైన ఏర్పాట్లు చేశారు. అయితే ఆయనకు సూటయ్యే ఊపిరితిత్తులు లభించని నేపథ్యంలో సర్జరీ ఆగిపోయింది.
మరోవైపు రోజురోజుకీ విద్యాసాగర్ ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. విద్యాసాగర్ బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త. 2009లో మీనా ఆయన్ని వివాహం చేసుకున్నారు. వీరికి నైనిక అనే ఒక పాప కూడా ఉంది.