నాని ఖాతాలో హిట్ పడినట్టేనా?: ‘అంటే సుందరానికీ’ మూవీ రివ్యూ..

- Advertisement -

‘ఉప్పెన’, ‘పుష్ప’ సినిమాలతో గతేడాది వరుస విజయాలు అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఏడాది ‘సర్కారు వారి పాట’తో హ్యాట్రిక్ అందుకుంది. అదే ఊపుతో ఇప్పుడు నేచురల్ స్టార్ నాని నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమాతో జనం ముందుకొచ్చింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా విడుదలైంది. ‘వి’, ‘టక్ జగదీశ్’, శ్యామ్ సింగరాయ్’ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో నాని కెరియర్ గ్రాఫ్ కొంత డౌన్ అయ్యింది. దీంతో ఈసినిమాపై నాని భారీగా ఆశలు పెట్టుకున్నాడు. ఇక ‘మెంటల్ మదిలో…’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాలతో చక్కని గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయకు మైత్రీ మూవీ మేకర్స్, నాని ఓ మంచి అవకాశం ఇచ్చారనే చెప్పాలి.

మరి ఈ సినిమా నానికి ప్లస్ అయిందా? పడిపోతున్న కెరీర్ గ్రాఫ్‌ను పైకి లేపేందుకు ఈ సినిమా పనికొస్తుందా? నాని మళ్లీ లైన్లో పడినట్టేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ‘అంటే సుందరానికి’ ఏమైందో తెలుసుకోవాలి. కాబట్టి ముందు కథలోకి వెళ్లిపోదాం రండి. సుందర్ సత్ సంప్రదాయాలను పాటించే బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. చిన్నప్పటి నుండి అతని ఇంట్లో ఆచార వ్యవహారాలకు విపరీతమైన ప్రాధాన్యం ఇస్తుంటారు. ఒకానొక సమయంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సుందర్ కి సినిమాల్లో ఛాన్స్ వచ్చి ఫారిన్ వెళ్ళాల్సి ఉండి, చివరి నిమిషంలో తప్పిపోతుంది.

దాంతో కొడుకు జాతకంలో ఏదో లోపం ఉందని తండ్రి గ్రహించి, జ్యోతిష్కుడు జోగారావుని ఆశ్రయిస్తాడు. అక్కడ నుండి సుందర్ జీవితమే మారిపోతుంది. ప్రతి చిన్నవిషయానికి దోష పరిహారమంటూ రకరకాల హోమాలు చేయిస్తుంటాడు జోగారావు. వాటిని తప్పించుకోవడానికి సుందర్ సైతం అబద్ధాలు ఆడటం మొదలెడతాడు. తన క్లాస్ మేట్ లీలా థామస్ ను ప్రేమించినా ఆ విషయం ఇంట్లో చెప్పడు. అలానే అమెరికా వెళ్లడానికి ఇంట్లోనూ, ఆఫీస్ లోనూ రకరకాల అబద్దాలు ఆడతాడు.

ఇదే పరిస్థితి అక్కడ లీలా థామస్ ఇంట్లోనూ జరుగుతుంది. హిందువుల ప్రసాదం తీసుకోవడానికే ఇష్టపడని ఆమె తండ్రి, బ్రాహ్మణుడైన సుందర్ కి ఇచ్చి తనను పెళ్ళి చేయడనే విషయం అర్థమైపోతుంది. అందుకే సుందర్ సలహా మేరకు ఆమె ఇంట్లో ఓ అబద్దం ఆడితే, ఇక్కడ సుందర్ మరో అబద్ధం ఆడతాడు. పెళ్ళి చేసుకోవడం కోసం వాళ్ళు ఆడిన ఆ దారుణమైన అబద్ధాలు వీళ్ళ జీవితాలను ఎలా అల్లకల్లోలం చేశాయన్నదే మిగతా సినిమా!

రెండు వేర్వేరు మతాలకు చెందిన యువతీ యువకులు ప్రేమించుకోవడం, ఇంట్లో పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేస్తారనుకున్నప్పుడు ఊరు వదిలి పారిపోవడం, ఆ తర్వాత రకరకాల సమస్యలు ఎదుర్కోవడం వంటి కథాంశంతో చాలా సినిమాలూ వచ్చాయి. పరువు హత్యలకు దారి తీసిన సంఘటనల నేపథ్యంలోనూ కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే ఇక్కడ అబద్దాలు ఆడి, పెద్దల సానుభూతి పొంది, రెండు వేర్వేరు మతాలకు చెందిన ప్రేమికులిద్దరూ పెళ్ళి చేసుకోవాలని అనుకుంటారు. నిజానికి ఇటు సుందర్, అటు లీలా కుటుంబ సభ్యులు సంప్రదాయాలకు ప్రాధాన్యమిచ్చే వారే కానీ పిల్లల మీద కక్షసాధింపుకు దిగి వారి అభిష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారు కాదు.

కానీ అటువంటి వారిని ముభ్య పెట్టాలని వీరు అనుకోవడం, దానికోసం ఘోరమైన అబద్ధాలు ఆడటంతో హీరోహీరోయిన్ల పాత్రలు ప్రేక్షకుల మదిలో పలచనైపోతాయి. సుందర్ పట్ల, అతని అగచాట్ల పట్ల అప్పటి వరకూ సానుభూతి చూపిన ప్రేక్షకులు కూడా ‘వీడు సామాన్యుడు కాదు’ అనే అభిప్రాయంలోకి వచ్చేస్తారు. అక్కడ నుండి ఆ పాత్రను ఓన్ చేసుకోవడం మానేసి అతని పట్ల నెగెటివ్ ఇంప్రషన్ ను క్రియేట్ చేసుకుంటారు. చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి వీరిద్దరూ తప్పు మీద తప్పు చేస్తూ పోతారు.

ఒకానొక సమయంలో ఆ తప్పే ఒప్పై వారిని ఇరకాటాన పెట్టినప్పుడు కూడా ప్రేక్షకుల నుండి సానుభూతి లభించదు. అయితే, ఆ సమయంలో దర్శకుడు కాస్తంత సెంటిమెంట్ కు చోటు కల్పించి, హీరోలో మానవీయ కోణాన్ని వెలికి తీసి, కథను సుఖాంతం చేశాడు. ఇక హీరో సుందరే ఫేక్ అనుకుంటే హీరోయిన్ లీలా ఇంకా పెద్ద ఫేక్ అని చెప్పడం కొసమెరుపు! |

‘అంటే సుందరానికీ…’ అనే పేరును ఈ సినిమాకు పెట్టినప్పుడే ఇదో అడల్ట్ కామెడీ మూవీ అనే భావన చాలా మందికి కలిగింది. ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి పేరున్న నానితో అలాంటి సినిమాను వివేక్ ఆత్రేయ ఎలా తీస్తాడో అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేశారు. బట్… ఈ విషయంలో హద్దులు మీరకుండా క్లీన్ ఎంటర్ టైనర్ గానే వివేక్ ఆత్రేయ తాను రాసుకున్న కథను తెరకెక్కించాడు. అయితే ఇక్కడో చిన్న విషయం ఉంది. సంప్రదాయాన్ని పాటించడం, జ్యోతిష్యాన్ని నమ్మడం, సమస్యల పరిహారార్థం హోమాలు చేయడం అనేది వారి వారి నమ్మకం.

ఇక్కడ జ్యోతిష్య శాస్త్రాన్ని తక్కువ చేసి చూపాల్సిన అవసరం లేదు. కానీ ప్రోగ్రెసివ్ థాట్స్ అనే పేరుతో దర్శకులు కొన్నిసందర్భాలలో అవసరం లేకున్నా ఎదుటి వారి నమ్మకాన్ని అవహేళన చేస్తున్నారు. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. మతం కంటే మానవత్వం గొప్పదని, సాటి మనిషికి సాయం చేయడం కంటే మనం చేసే మంచిపని మరొకటి లేదనే విషయాన్ని దర్శకుడు అంతర్లీనంగా ఈ ప్రేమకథలో చెప్పాడు. అంతేకాకుండా…. పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం కాదని, రెండు కుటుంబాల కలయిక అని తెలిపాడు. ఇది సంతోషించాల్సిన విషయమే.

సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ వివేక్ ఆత్రేయ తనదైన మార్క్ సంభాషణలతో నవ్వుల పువ్వులు పూయించాడు. ప్రతి సన్నివేశంలో సంభాషణలు చమక్కుమన్నాయి. అయితే సినిమా నిడివి విషయమై దృష్టి పెట్టకపోవడం అతను చేసిన అతి పెద్ద తప్పు అని అనిపిస్తుంది. సినిమా నిడివి దాదాపు మూడు గంటలు ఉంది. ప్రథమార్ధం మాత్రమే కాదు, ద్వితీయార్థంలోనూ ట్రిమ్ చేయాల్సిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి.

ఎన్నో సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన వివేక్ సాగర్ తన స్థాయి బాణీలను ఇందులో ఇవ్వలేకపోయాడు. సినిమా చూసిన తర్వాత హమ్ చేయదగ్గ పాట ఒక్కటీ కనిపించదు. బహుశా ఆ లోటును తీర్చుకోవడం కోసమే కావచ్చు, క్యాచీ ట్యూన్ తో డాన్స్ నంబర్ గా ప్రమోషనల్ సాంగ్ ను చివరిలో విడుదల చేశారు. అయితే వివేక్ సాగర్ నేపథ్యం సంగీతం, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చక్కగా బాగున్నాయి. ఎడిటర్ రవితేజ గురిజాలకు మాత్రం దర్శకుడు. ఎక్కడా స్వేచ్ఛ ఇచ్చినట్టు కనిపించలేదు.

నటీనటుల విషయానికి వస్తే… సుందర్ గా నాని అదరగొట్టేశాడనే చెప్పాలి. అతని క్యారెక్టరైజేషన్ లో లోపం ఉందేమో కానీ నాని నటనను వంక పెట్టడానికి లేదు. ఇక మల్లూవుడ్ నుండి టాలీవుడ్ కి వచ్చిన నజ్రియా… లీలా థామస్ పాత్రను బాగానే పోషించింది. ముఖ్యంగా మొదటి సినిమాలోనే తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. బట్ ఎందుకో ఆ పాత్రలో అంత ఫ్రెష్ నెస్ కనిపించలేదు. చిత్రం ఏమంటే నటి అనుపమా పరమేశ్వరన్ ఇందులో ఓ ప్రధాన పాత్ర పోషించింది. ఆ విషయాన్ని మూవీ టీమ్ ఎందుకో గోప్యంగా ఉంచింది. నిజానికి అంత దాచాల్సిన అవసరం ఏమీ లేదు.

ఓ పక్క సోలో హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న అనుపమా పరమేశ్వరన్ ఈ సినిమాలో ఇలాంటి సహాయ పాత్ర చేయాల్సిన అవసరం కూడా లేదు. బహుశా నిర్మాణ సంస్థ మీద ఉన్న అభిమానంతో నటించి ఉండొచ్చు. ఇక హీరో తల్లిదండ్రులుగా రోహిణి, నరేశ్, నానమ్మగా అరుణా భిక్షు, హీరోయిన్ తల్లిదండ్రులుగా నదియా, తమిళ నటుడు అళగన్ పెరుమాళ్, అక్కగా మలయాళీ నటి తన్వీ రామ్ నటించారు. వినోదాన్ని అందించే బాధ్యతను అలీ, హర్షవర్థన్, పృథ్వీ, రాహుల్ రామకృష్ణ తమ భుజాల కెత్తుకున్నారు.

ఆ మధ్య వచ్చిన ‘స్టాండప్ రాహుల్ ‘ లో నటించిన ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేశ్ మహా ఇందులోనూ ఓ పాత్రలో మెరిశాడు. సినిమాలో చాలామంది నటీనటులు ఉన్నారు, వారి నుండి చక్కని నటనను వివేక్ ఆత్రేయ రాబట్టుకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ఖర్చు విషయంలో రాజీ పడలేదనేది తెలుస్తూనే ఉంది. అయితే ఇలాంటి సినిమాలను థియేటర్లో చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేయగలరు.

ఈ సినిమాలో నటీనటుల యాక్టింగ్‌ సినిమాకే ప్లస్ పాయింట్. అయితే, కథనం మాత్రం ఆకట్టుకోలేకపోయింది. నిడివి ఎక్కువ కావడం కూడా ఈ సినిమాకు మైనస్ పాయింట్‌గా చెప్పుకోవాలి. అలాగే, ఎమోషనల్ సీన్స్ కూడా పండలేదు. మొత్తంగా సినిమా గురించి చెప్పుకోవాలంటే అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది.

- Advertisement -