జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రాక కన్ఫామ్.. బీఆర్ఎస్‌గా మారిపోతున్న టీఆర్ఎస్

telangana-cm-kcr-extends-lock-down-till-may-29
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఫిక్స్ అయింది. తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)ని భారత్ రాష్ట్రీయ సమితి (BRS)గా మార్చి జాతీయ రాజకీయాల కదన రంగంలోకి దూకబోతున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ నెల 19న పార్టీని ప్రకటిస్తారు. ఈ మేరకు నిన్న అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఇతర నేతలతో నిన్న ప్రగతి భవన్‌లో ఈ విషయమై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో దేశ రాజకీయ పరిస్థితులు, టీఆర్ఎస్ పోషించబోతున్న పాత్రపైనా చర్చ జరిగింది.

పార్లమెంటు సమావేశాల్లో ప్రజా సమస్యల గురించి చర్చ జరగడం లేదని, మాట్లాడదామంటే ‘జైశ్రీరాం’ నినాదాలతో అడ్డుకుంటున్నారని, రాజకీయ లబ్ధికోసం మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆక్షేపించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 97 శాతం అపజయాలు మూటగట్టుకుందని గుర్తు చేశారు.

కాబట్టి దేశ ప్రజల అవసరాలు తీర్చేందుకు జాతీయ పార్టీని ఏర్పాటు చేసుకుని ముందుకెళ్దామని నేతలతో కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఈ నెల 19 లోగా కార్యవర్గ సమావేశం నిర్వహించి తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చే విషయంలో తుది నిర్ణయం ప్రకటించి, ఈ నెలాఖరులో ఢిల్లీలో పార్టీని ప్రకటించాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తోంది.

గత కొంత కాలంగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన గులాబీ బాస్ ఇటీవల పలు రాష్ట్రాల్లో పర్యటించారు. పలు ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీని ఆయన టార్గెట్ చేశారు. ఈ రెండు పార్టీలతో దేశానికి నష్టమని చెబుతూ వస్తున్నారు.

ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలతో విసిగిపోయి..

దీంతో కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరిగింది. గతంలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన తేవడంతో అందులో భాగంగానే దేశమంతా పర్యటిస్తున్నారని అంతా భావించారు. అయితే, ఆ ప్రయత్నాలు అనుకున్న ఫలితాలు ఇవ్వకపోవడంతో తానే కొత్త పార్టీతో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జూలై 2,3 తేదీలలో హైదరాబాద్ లో జరగనున్నాయి. ఆ సమావేశాల కంటే ముందే జాతీయ పార్టీని కేసీఆర్ ప్రకటించాలని కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు ఉంది. ఈ గుర్తునే భారత్‌ రాష్ట్రీయ సమితి కు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరనున్నారని సమావేశం.

పార్టీ నేతలకు కొత్త పార్టీపై స్పష్టత ఇచ్చిన కేసీఆర్ జాతీయ స్ఠాయిలో అనుసరించబోయే వ్యూహలతో పాటు రాష్ట్రపతి ఎన్నికలపైనా చర్చించారని తెలుస్తోంది. దాదాపు ఆరు గంటల పాటు జరిగిన సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు భవిష్యత్ కార్యాచరణపైనా నేతలకు దిశానిర్దేశం చేశారు.

దేశంలో బీజేపీ ఆగడాలు పెరిగిపోయాయని, బీజేపీ పాలనలో దేశం దిగజారిపోయిందని కేసీఆర్ నేతలతో చెప్పారు. ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ విఫలమైందన్న కేసీఆర్, ఈ రెండు పార్టీలతో దేశానికి నష్టమని పేర్కొన్నారు. దేశ ప్రజలు కొత్త రాజకీయ శక్తి కోసం చూస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆ స్థానాన్ని మనమే ఎందుకు భర్తీ చేయకూడదని పార్టీ నేతలను ప్రశ్నించారు.

తెలంగాణపై కేంద్రం వివక్ష

త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికను ఇందుకు ఉపయోగించుకోవాలని కూడా అన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్న కేసీఆర్.. అందుకే తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తుందని విమర్శించారు. సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను ప్రత్యర్థులను టార్గెట్ చేయడానికి మోదీ ప్రభుత్వం ఉపయోగించుకుటోందని కేసీఆర్ ఆరోపించారు.  క్లిష్ట పరిస్థితుల్లోనే ఉన్న దేశాన్ని రక్షించేందుకు కొత్త పార్టీ అవసరమని తేల్చి చెప్పారు. జాతీయ పార్టీ పెట్టినా తాను తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే పని చేస్తానని కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

- Advertisement -