హైదరాబాద్: త్వరలో జరగనున్న ఫెమీనా ‘మిస్ ఇండియా’ బ్యూటీ కాంటెస్ట్ నుంచి తాను తప్పుకున్నట్టు ప్రముఖ నటుడు రాజశేఖర్ కుమార్తె, నటి శివాని రాజశేఖర్ తీవ్ర భావోద్వేగాల నడుమ వెల్లడించారు.
తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆమె దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పోటీ నుంచి తాను ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందీ అందులో వివరించారామె.
మెడికల్ థియరీ పరీక్షలు ఉండడం, మలేరియా రావడం తదితర కారణాల వల్ల తాను ఈ పోటీకి సంబంధించిన ట్రైనింగ్, గ్రూమింగ్ సెషన్స్, సబ్ కాంటెస్ట్స్‌లో పాల్గొనలేకపోయినట్లు పేర్కొన్నారు.
తన ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనుకున్న తేదీ కంటే ముందుగానే(బుధవారం నుంచే) మొదలయ్యాయని, అంతేకాకుండా ‘మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే’ జరిగే రోజున (జూలై 3) కూడా ఎగ్జామ్ ఉందని, దీంతో తాను ఈ బ్యూటీ కాంటెస్ట్ ప్రయాణాన్ని కొనసాగించలేకపోతున్నానని శివాని తెలిపారు.
మిస్ ఇండియా పోటీల్లో శివాని తమిళనాడు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం పొందరు. అయితే ఇప్పుడిలా అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు తనకు సహకరించిన అందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.
‘అద్భుతం’ చిత్రంతో నటిగా టాలీవుడ్‌లో ఆరంగేట్రం చేసిన శివాని రాజశేఖర్.. ఆ తరువాత ‘www’, ‘శేఖర్’ చిత్రాల్లో కూడా మెరిశారు. ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాల్లో, తెలుగులో ‘అహ నా పెళ్లంట’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు.
అందాల పోటీ నుంచి శివాని తప్పుకోవటంతో ఆమె అభిమానులు నిరాశ పడ్డారు. అయితే దానికన్నా చదువుకు ప్రాధాన్యమివ్వడం గమనించి ఆమెకు ఉజ్వల భవిష్యత్తు కలగాలంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
View this post on Instagram